Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డికి మళ్ళీ కీలక బాధ్యతలు.. ఏం జరుగుతోందబ్బా.?

Vijaya Sai Reddy  : వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వున్న సన్నిహిత సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? వైఎస్ జగన్ అంతరంగమేంటో అన్ని విషయాల్లోనూ తెలిసిన అతికొద్దిమందిలో విజయసాయిరెడ్డి ఒకరు.
అయితే, కొన్ని కారణాలతో విజయసాయిరెడ్డి నుంచి కొన్ని బాధ్యతల్ని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఇతర నేతలకు అప్పగించారు. కానీ, ఏమయ్యిందో.. మళ్ళీ తిరిగి పార్టీలో కీలక వ్యవహారాల్ని విజయసాయిరెడ్డి చేతిలో పెడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీకి సంబంధించిన కీలకమైన అన్ని విభాగాలకూ ఇన్‌ఛార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తనపై ఇంత బాధ్యత వుంచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి, పార్టీ మరింత పటిష్టమయ్యేందుకు కృషి చేస్తానని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అంతా బాగానే వుందిగానీ, విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖంగా లేరనీ, అందుకే ఈ బాధ్యతల్ని అప్పగించి, ‘రాజ్యసభ సభ్యత్వాన్ని’ కట్ చేయబోతున్నారనీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి, గత కొద్ది రోజులుగా ఈ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఊహాగానాలు వినిపిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
విజయసాయిరెడ్డిని కాదని వైఎస్ జగన్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరన్న భావన వైసీపీలో ఒకప్పుడు బలంగా వుండేది. కానీ, క్రమక్రమంగా చాలా మారాయ్. ఇంతకీ, విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం ఇక్కడితో ముగిసిపోయినట్లేనా.? వేచి చూడాల్సిందే.