యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన..సంక్షేమ పథకాలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. వయసులో చిన్నవాడైనా…ఆలోచనలో పెద్దవాడని జగన్ చాటి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వే యంగ్ సీఎం ఏడాది పాలనను ఆకాశానికి ఎత్తింది. తొలి ఏడాదిలోనే మెనిఫెస్టోలోని అంశాలను 90 శాతం పూర్తిచేసి మాట తప్పడు..మడము తిప్పడు అని జగన్ నిరూపించారు. జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న అవినీతి అక్రమాల కేసులు, ప్రభుత్వంపై ఆరంభంలో తలెత్తిన ఇబ్బందులను పక్కనబెడితే ఏడాది పాలనపై వచ్చిన ఫీడ్ బ్యాక్ చాలా గొప్పది. రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసల కురిసాయి.
తాజాగా జగన్ పేరు తమిళనాడులోనూ సంచలనంగా మారింది. వచ్చే ఏడాది ఆ రాష్ర్టంలో ఏప్రిల్, మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ జగన్ పోస్టర్లు, కటౌట్లు భారీ ఎత్తున వెలిసాయి. జగన్ స్ఫూర్తితో స్టార్ హీరో విజయ్ రాజకీయాలలోకి రావాలంటూ అభిమానులు విజయ్-జగన్ పోస్టర్లు సాక్షిగా కోరారు. వాస్తవానికి విజయ్ రాజకీయాల్లో రావాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు విజయ్, అతని తండ్రి చంద్రశేఖర్ పై అభిమానులు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. కాగా ఈ నెల 22న సోమవారం విజయ్ పుట్టిన రోజు నేపథ్యంలో అభిమానుల ఒత్తిడి ఇలా మరింత ఎక్కువైనట్లు కనిపిస్తోంది.
‘రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న సర్కార్’ అంటూ పోస్టర్లపై స్లోగన్స్ రాశారు. చెన్నై, మధురై, కుంభకోణం తదితర ప్రాంతాల్లో వెలిసాయి. తమిళనాడులో సినిమాలకు-రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తదితరులు వెండితెరపై ఓ వెలుగువెలిగి రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం కమల్ హాసన్ కూడా `మక్కల్ నీది మయ్యం` అనే పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ అరంగేట్రానికి సిద్ధ మవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఎంట్రీ కూడా షురూ అవ్వాలని అభిమానులు ఆశపడుతున్నారు.