తమిళనాడు కరూర్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఒక భారీ సభ విషాదంగా మారింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 38 మంది మృత్యువాత పడ్డారు. వారిలో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. అదనంగా 50 మందికిపైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ సభకు దాదాపు 10 వేల మంది వస్తారని అంచనా వేసినా, 50 వేల మందికి పైగా తరలివచ్చారు. ఇరుకైన ప్రాంగణంలో అంచనాలకు మించి అభిమానులు, కార్యకర్తలు ఒకేసారి కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగింది. తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, విజయ్ ఆలస్యంగా చేరుకోవడంతో జనసంద్రం ఉధృతమై ప్రాణాంతక పరిణామానికి దారితీసింది.
ఘటన తర్వాత విజయ్ నిశ్శబ్దంగా చెన్నైకి చేరుకున్నారు. మీడియా మాట్లాడాలని ప్రయత్నించినా, ఆయన మౌనంగా వెళ్లిపోయారు. అయితే, కొన్ని గంటల తర్వాత సోషల్ మీడియాలో స్పందించారు. “నా గుండె ముక్కలైంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
ఈ దుర్ఘటనపై రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి. డీఎంకే నేతలు విజయ్‌ను నేరుగా తప్పుబట్టారు. సభలో తగిన ఏర్పాట్లు చేయలేకపోవడం వల్లే ఇంతమంది అమాయకులు బలైపోయారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని చూడడానికి స్టాలిన్ కరూర్‌కు వెళ్ళనున్నారు.
జనం ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనతో తమిళనాడంతా కన్నీటిలో మునిగిపోయింది. అభిమానుల సముద్రం ఉప్పొంగితే అది ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. కరూర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
