Karur Rally: 38మంది మృతికి కారణమైన.. విజయ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్..!

తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లా నిన్న భయంకరమైన విషాదాన్ని చూచింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 38 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఒక్కసారిగా అదుపు తప్పిన జనసందోహం 38 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. మృతుల్లో పది మంది చిన్నారులు, పదిహేడు మంది మహిళలు ఉండటం ఈ ఘటనను మరింత హృదయ విదారకంగా మార్చింది.

విజయ్ సభకు వందలాది కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు ఊహించని స్థాయిలో తరలి వచ్చారు. టీవీకే నాయకత్వం సుమారు పది వేల మంది వస్తారని లెక్కగట్టగా, ఐదు రెట్లు ఎక్కువగా, దాదాపు యాభై వేల మంది జనాలు చేరుకున్నారు. ఇరుకైన ప్రదేశంలో ఆ జనాన్ని అదుపు చేయడం నిర్వాహకులకు కష్టమైపోయింది. విజయ్ ఆలస్యంగా వేదికపైకి రాగానే ఉద్వేగానికి లోనైన అభిమానులు ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాటకు దారి తీసింది.

ఈ ఘటనపై రాజకీయంగా వేడి చర్చలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న డీఎంకే ఘాటుగా స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ అన్నాదురై సంచలన ఆరోపణలు చేశారు. తొక్కిసలాట నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆయన ఆరోపించారు. సభ సమయానికి ప్రారంభం కాలేదని, జనాలను ఉద్దేశపూర్వకంగా వేచి పెట్టారని తీవ్రంగా విమర్శించారు. జనాలను సమీకరించడానికే విజయ్ ఇలా చేశాడు. ఇది నిర్వాహకుల నిర్లక్ష్యమే కాదు, నేరపూరిత కుట్ర అని శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను తక్షణం అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషాదకర ఘటనతో కరూర్ అంతా షాక్‌కు గురైంది. ఆసుపత్రులు విలపిస్తున్న కుటుంబ సభ్యులతో నిండిపోయాయి. గాయపడిన వందలాది మందిని తక్షణం చికిత్సకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ్ సభలో జరిగిన ఈ విషాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు, పార్టీ నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.