వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా ‘గని’. ఏ సినిమాకూ ఇవ్వనన్ని డేట్స్ ఈ సినిమా కోసం కేటాయించాడు వరుణ్. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలానే కష్టపడ్డాడు. ఇంకా పడుతూనే ఉన్నాడు. విదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకుని వచ్చాడు. మధ్యలో గాయాలు కూడ ఆయన్ను ఇబ్బంది పెట్టాయి. అయినా వరుణ్ కమిట్మెంట్ వదల్లేదు. టీమ్ చాలానే కష్టపడ్డారు. కానీ చిత్రాన్ని సమస్యలు వెన్నాడుతున్నాయి. ప్రధానంగా బడ్జెట్ విషయంలో నిర్మాతలకు నడుమ పొరపచ్ఛాలు వచ్చాయని ఫిలిం నగర్ టాక్.
ఈ చిత్రానికి అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ, ఆయన స్నేహితుడు సిద్దులు నిర్మాతలు. బడ్జెట్ విషయంలో వీరి నడుమ చిన్న చిన్న సమస్యలు తలెత్తాయట. వరుణ్ తేజ్ సినిమా కావడంతో బాబీ ఖర్చుకు వెనుకాడలేదట. ఈమధ్యనే ఇక భారీ సెట్ వేసి అందులో షూటింగ్ చేయకుండానే తొలగించారట. ఫలితంగా ఎక్కువ మొత్తమే నష్టపోవాల్సి వచ్చిందట. పైపెచ్చు కథలో తరచూ మార్పులు, చేర్పులు జరుగుతుండటం కూడ కొంత ఇబ్బందికరంగా మారిందట. వీటికి తోడు కరోనా సమస్యలు అదనం. వీటన్నింటినీ అధిగమించి ‘గని’ ఎలా బయటికొస్తుందో చూడాలి.