కరోనా మొదటి వేవ్ సందర్భంగా కేంద్రం మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన సామాన్యులకీ, పరిశ్రమలకీ ఈ మారటోరియం కాస్తో కూస్తో ఉపయోగపడిన మాట వాస్తవం. మరి, రెండో వేవ్ సందర్భంగా ఎందుకు కేంద్రం మారటోరియం ప్రకటించలేదు.? అంటే, అసలు కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తే కదా.. మారటోరియం గురించి ఆలోచించడానికి.? అన్న చర్చ తెరపైకొస్తోంది. కేంద్రం, రెండో వేవ్ సందర్భంగా లాక్ డౌన్ అవకాశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. బాధ్యతల నుంచి తప్పించుకోవడంలో కేంద్రం వేసిన తెలివైన అడుగు ఇది.
ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లెవెత్తుతున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంది. కాగా, కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరోమారు మారటోరియం ప్రకటిస్తే, కొంత ఊరట దొరుకుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పంచుకుంటున్నారు.
కేంద్రానికి మారటోరియంపై లేఖ రాద్దామని ప్రతిపాదించారు స్టాలిన్. అయితే, ఈ వ్యవహారంపై ఇంకా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాల్సి వుంది. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో మరణాలు చాలా ఎక్కువగా చోటు చేసుకున్నాయి. చాలా కుటుంబాలు పెద్ద దిక్కుని కోల్పోయాయి. కుటుంబ పెద్దను కోల్పోతే ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులేమైపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోపక్క, ఇంట్లో ఒక్కరు కరోనా బారిన పడినా, లక్షలకు లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా చాలామంది అప్పులపాలైపోయారు.
అలాంటివారందరికీ మారటోరియం ఊరటనిస్తుంది. అయితే, బ్యాంకులు వేల కోట్లు ఎగ్గొట్టిన రాజకీయ నాయకుల్ని వదిలేస్తాయేమోగానీ, సామాన్యుడ్ని మాత్రం పీల్చి పిప్పి చేసెయ్యడం మామూలే. కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప, బ్యాంకులు మానవీయ కోణంలో ఆలోచించే పరిస్థితి లేదు.