ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, సాంకేతిక అంశాల్ని సాకుగా చూపుతూ, కేంద్రం ఈ దిశ బిల్లుని తొక్కి పెడుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణలో కొన్నాళ్ళ క్రితం దారుణ హత్యాచారానికి గురైంది దిశ. ఆ దిశ ఘటన నేపథ్యంలో దిశ చట్టాన్ని తీసుకురావాలని వైఎస్ జగన్ సంకల్పించిన విషయం విదితమే.
దిశ యాప్ అమల్లోకి వచ్చింది.. దిశ పోలీస్ స్టేషన్లు.. దిశ బైక్‌లు.. ఇలా చాలా కార్యక్రమాలే చేపట్టింది వైఎస్ జగన్ సర్కార్. అయితే, దిశ చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేసి, వారిని దోషులుగా నిరూపించాలంటే.. దిశ చట్టం అవసరం. కానీ, అందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ‘దిశ’ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ఈ లేఖలో వైఎస్ జగన్ ప్రస్తావించారు. కాగా, ఢిల్లీలో కొన్నేళ్ళ క్రితం నిర్భయ ఘటన జరిగింది. తదనంతరం నిర్భయ చట్టం దేశంలో అమల్లోకి వచ్చింది. అయినా, దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగలేదు.
కొత్త చట్టాలు కాదు… ప్రభుత్వ పెద్దల ఆలోచనల్లో మార్పులు రావాలి.. ఆయా చట్టాలు సరిగ్గా అమలయ్యేలా పాలకులు ప్రయత్నించాలి.. పోలీసు వ్యవస్థకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి.. ఈ తరహా ఘటనల విచారణ సందర్భంగా రాజకీయ జోక్యం వుండకూడదని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
సరే, అదెలాగూ మన దేశంలో జరిగే పనే కాదనుకోండి.. అది వేరే సంగతి. రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి ఆలోచనతో దిశ చట్టాన్ని తీసుకురావాలనుకుంటోంటే, కేంద్రమెందుకు అడ్డు తగులుతోంది.? అన్నది వైసీపీ నేతల వాదన.
జగన్ లేఖ రాశారు గనుక.. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని వైసీపీ నేతలు ఈసారి మరింత ధీమాగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం స్పందించినట్లు, ఇలాంటి చట్టాల విషయంలో అంత వేగంగా స్పందించే అవకాశం లేదన్న వాదనలూ లేకపోలేదు.