ఉచితాల దారి ఉచితాలదే.. ఓట్ల దారి ఓట్లదే.. చంద్రబాబు, జగన్ మారతారా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది నేతలు అధికారంలోకి రావడానికి ఉచిత పథకాలపై దృష్టి పెడుతున్నారు. ఉచిత పథకాల వల్ల ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కార్ ఊహించని స్థాయిలో ఉచిత పథకాలను అందజేస్తోంది. ప్రభుత్వ పథకాల వల్ల ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు బెనిఫిట్ పొందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉచిత పథకాలు ఒక్కటే ప్రభుత్వంపై మంచి అభిప్రాయాన్ని కలిగించలేవు.

చంద్రబాబు 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చినా చంద్రబాబును ప్రజలు పట్టించుకోలేదు. ఉచిత పథకాల వల్ల బాగుపడ్డ వాళ్లు ఉన్నారా అనే ప్రశ్నకు సైతం కాదనే సమాధానం వినిపిస్తుంది. ఉచిత పథకాలను అందుకున్న వాళ్లు ఆ డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం కార్యకర్తలతో వరుసగా భేటీలను ఎందుకు నిర్వహించారనే ప్రశ్నకు సైతం ఉచిత పథకాల వల్ల ప్రజలకు బెనిఫిట్ కలుగుతున్నా ప్రజల్లో వ్యతిరేకత పెరగడమే కారణమని తెలుస్తోంది. ఉచిత పథకాలు అందుకుంటున్న ప్రజల్లో కూడా ఆ పథకాల విషయంలో గౌరవం లేదు. కొంతమంది ఉచిత పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారనే భావనను కలిగి ఉన్నారు.

మరి కొందరు ప్రభుత్వం తాము పన్నుల రూపంలో కట్టిన డబ్బును పథకాల రూపంలో ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పథకాలు 2024 ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని కొంతమంది భావిస్తుండగా ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి లాభం ఉండదని మరి కొందరు భావిస్తుండటం గమనార్హం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళితే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు అర్థమైంది.