బండ్ల గణేష్‌కి జ్ఞానోదయం: కలిగించిందెవరు.?

 

‘మా’ ఎన్నికల్లో ఇది ఎవరూ ఊహించని ట్విస్ట్. బండ్ల గణేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి సోలోగా, ఎలాంటి ప్యానెల్ లేకుండా నామినేషన్ వేశాడు. కానీ, ఊహించని రీతిలో ఆ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోనే కొనసాగుతానన్నాడు. ఆ ప్యానెల్‌కి తన మద్దతు ఉంటుందన్నాడు.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌ని గెలిపిస్తానంటూనే, ఆ ప్యానెల్‌లోని ఒకరిద్దరికి మాత్రం ఓటేయనని స్పష్టం చేశాడు. అందులో ఒకరు సినీ నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత. అసలేమైంది.? బండ్ల గణేష్‌కి జ్ఞానోదయం ఎలా అయ్యింది.? ఇది ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

‘దైవ సమానులు’ అని పేర్కొంటూ వారి సలహా మేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నాడు. ఆ ‘దైవ సమానులు’ ఇంకెవరో కాదు, పవన్ కళ్యాణ్.. అనే చర్చ నడుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ నిజంగా బండ్ల గణేష్‌ని అలా ఆదేశించి ఉంటే, దైవ సమానులు అని చెప్పడు. ‘నా దేవర ఆదేశం’ అంటాడు. సో ఇక్కడ ఇంకెవరో.. బలమైన వ్యక్తి లేదా శక్తి బండ్ల గణేష్‌ని అలా మార్చినట్లు భావించాలి.

ఇద్దరు యోధులు ఘనంగా పోరాటం చేస్తున్నప్పుడు మధ్యలో నేనుండి, నా వల్ల సమస్య రాకూడదనీ, గెలిచిన వారు నన్ను సాకుగా చూపి పని చేయకపోతే, అది నా తప్పిదమవుతుందనీ, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నాననని బండ్ల గణేష్ చెప్పాడు.