‘పుష్ప’లో ముందు సుహాస్‌ను అనుకున్నా: మనసులో మాట చెప్పిన సుకుమార్‌!?

అల్లు అర్జున్‌ హీరోగా తాను తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘పుష్ప’ లోని ఫ్రెండ్‌ క్యారెక్టర్‌కు ముందుగా సుహాస్‌ని అనుకున్నామని దర్శకుడు సుకుమార్‌ తెలిపారు. ‘ప్రసన్నవదనం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, ఈ ఆసక్తికర విషయం పంచుకున్నారు. సుహాస్‌ హీరోగా అర్జున్‌ వై.కె. తెరకెక్కించిన చిత్రమిది. పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ హీరోయిన్లు. మే 3న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఈవెంట్‌ను నిర్వహించింది. సతీసమేతంగా సుకుమార్‌, మరో దర్శకుడు బుచ్చిబాబు హాజరయ్యారు. ‘సుహాస్‌.. నువ్వుంటే నాకు, అల్లు అర్జున్‌కు ఇష్టం. నీ ఎదుగుదల చూస్తున్నాం. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ కేశవగా ముందు నిన్నే అనుకున్నాం. కానీ, అప్పటికే హీరోగా చేస్తున్న నిన్ను ఆ రోల్‌కి ఎంపిక చేయడం బాగోదనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్‌.. ఫ్యూచర్‌ నానిలా అనిపిస్తున్నాడు. సహజ నటుడు నాని కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో. అంతగా ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడు. ఈ సినిమాలో రాశీసింగ్‌, పాయల్‌ రాధాకృష్ణ చక్కగా నటించారు‘ అని ప్రశంసించారు. తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అర్జున్‌ గురించి మాట్లాడుతూ.. నేను ‘జగడం’ సినిమా రూపొందిస్తున్న సమయంలో అర్జున్‌ నన్ను కలిశాడు. ‘విూ ఆర్య చిత్రం నాకు బాగా నచ్చింది సర్‌. విూ వద్ద పని చేయాలనుకుంటున్నా’ అని అన్నాడు.

టీమ్‌లో జాయిన్‌ చేసుకున్నా. చాలా అమాయకుడు. కానీ, లాజిక్‌ ఉన్నవాడు. అర్జున్‌, మరో అసిస్టెంట్‌ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100శాతం లవ్‌’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. వీళ్లతోపాటు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరు యాడ్‌ అవుతూ ఉండేవారు. అర్జున్‌ బిజీగా ఉండడంతో నేను లాజిక్‌ ఉన్న సినిమాలను మానేశా. అర్జున్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. నా అర్జున్‌ని సపోర్ట్‌ చేయండి‘ అని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.