చంద్రబాబు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక వర్గం మీడియా… ఆయన అరెస్ట్ పై స్పందించాలని ప్రముఖుల వెంట పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సినిమా ప్రమోషన్ లో పాల్గొనే హీరోలు, నిర్మాతలకు ఈ ప్రశ్నలు తప్పడం లేదు.. తప్పించుకోవడం లేదు!
ఈ సమయంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్ లో భాగంగా మీట్ ది ప్రెస్ అని దగ్గుబాటి సురేష్ బాబు జర్నలిస్ట్ లను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. అయితే… చంద్రబాబు అరెస్టుకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇండస్ట్రీ స్పందించడం లేదని అనడం తప్పు… రాజకీయాలు, మతపరమైన విషయాలపై ఇండస్ట్రీ స్పందించదు అని క్లియర్ పిక్చర్ ఇచ్చారు.
ఈ సమయంలో కొన్ని మీడియా సంస్థలు మాత్రం… “స్పందించాలని ఉన్నా స్పందించలేకున్నా.. అతి సున్నితమైన అంశం కాబట్టి” అంటూ సురేష బాబు వ్యాఖ్యలకు భావానువాదం చేశారు. దీన్నే వక్రీకరించి రాయడం అని కూడా అంటారని అంటుంటారు! ఈ సమయంలో తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన విశాల్ కి ఈ ప్రశ్న ఎదురైంది.
ఇందులో భాగంగా జగన్ మీకు అభిమాన నాయకుడు… చంద్రబాబు అరెస్ట్ ను మీరు ఏ విధంగా చూస్తారు అని ఒక జర్నలిస్టు, హీరో విశాల్ ని ప్రశ్నించారు. “నిజాయితీగా చెప్పాలంటే నాకు నచ్చిన పాలిటిషియన్ అయినా నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాడులో వేశాను” అని చెప్పారు.
అనంతరం… “చంద్రబాబు గారిని పోలీస్ డిపార్ట్ మెంట్ అరెస్టు చేశారు.. రిమాండ్ లో పెట్టారు.. ఒక కేసుకు సంబంధించిన విషయం ద్వారా రిమాండ్ చేశారు.. ఒక వ్యక్తిగా నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే తప్పలేదు అన్నప్పుడు.. సామాన్యుడినైన నాకు భయమేస్తుంది” అని అన్నారు. దీంతో ఇంటర్ ప్రిటేషన్ మొదలైపోయింది!
“చంద్రబాబు లాంటి నాయకుడికే జైలు తప్పలేదంటే… ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి.. నాకు చాలా భయం వేసింది” అనే వక్రీకరణ విశాల్ వ్యాఖ్యలపై జరిగిందని తెలుస్తుంది. అయితే విశాల్ ఉద్దేశ్యం మాత్రం అది కాదని… “చంద్రబాబుకే అరెస్ట్ తప్పలేదు… తప్పు చేస్తే ఇక తనలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటి అని తనకు భయం వేసింది” అని విశాల్ చెప్పారని అంటున్నారు విశ్లేషకులు!
దీంతో… అక్షరాలు వరుస తప్పితే ఎంత బూతుగా మారిపోద్దో… వాక్యాలు లైను తప్పినా, మాటలు వరుస తప్పినా అలాగే మారిపోతుందని, జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు పరిశీలకులు.
కాగా… చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకూ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు, నిర్మాతలు నట్టి కుమార్, అశ్వనీదత్, కేఎస్ రామారావు, బండ్ల గణేష్ లు స్వచ్చందంగా రియాక్ట్ అయ్యారు! ఇక మరో సీనియర్ నిర్మాత, సురేష ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, హీరో విశాల్ లు మీడియా అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ… తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు!