స్థానిక సంస్థల ఎన్నికల వివాదంలో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం యొక్క సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని, ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో నిమ్మగడ్డ మీద ప్రభుత్వానిదే పైచేయి అయింది. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఉన్నందున ఎన్నికల సిబ్బంది కొరత ఉంటుందనే వాదనను తెరమీదకు తెచ్చి ప్రభుత్వం పైచేయి సాధించింది. ఈ తీర్పుతో నిమ్మగడ్డకు, ఆయన వెనకున్న చంద్రబాబుకు గట్టి షాట్ తగిలిందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈసీ, తెలుగుదేశం నేతలు, వారి అనుకూలుర ఆశలు మాత్రం పూర్తిగా అడుగంటలేదు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. ఈ నెల 18న దీనిపై విచారణ జరగనుంది. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం గతంలో జరిగిఆన్ ఇలాంటి ఘటనలే ఉదాహరణలుగా చూపుతూ సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తప్పదని అంటున్నారు. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అయితే సుప్రీం కోర్టు మేము జోక్యం చేసుకోమని, ఎన్నికలు పెట్టాలా వద్ద అనేది ఈసీ నిర్ణయమేనని తేల్చి చెప్పింది. ఆ తర్వాత కేరళలో ఎన్నికలు జరిగాయి. వీటిని ప్రస్తావిస్తున్న టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల విషయంలో కూడ సుప్రీం కోర్టుకు పిటిషన్లు వెళితే తుది నిర్ణయాన్ని ఈసీకి వదిలేస్తారని అప్పుడు ఎన్నికలు తప్పకుండా జరుగుతాయని ధీమాగా ఉన్నారు. గతంలో కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేసిన విషయగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా ఎస్‌ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.