సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేసి ఆ తరువాత దర్శకులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మంచి కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు సంతోష్ శ్రీనివాస్. అతని మొదటి సినిమా కందిరీగ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ తరువాత మాత్రం అనుకున్నంత రేంజ్ లో హిట్స్ అందుకోలేదు.
జూనియర్ ఎన్టీఆర్ తో రభస సినిమా చేశాడు గాని ఆ సినిమా దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. మరోసారి రామ్ తో చేసిన హైపర్ కూడా వర్కవుట్ కాలేదు. ఇక ఈ దర్శకుడు పూర్తిగా అల్లుడు అదుర్స్ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టయితే తన నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.
ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ఉంటుందని అనుకున్నారు. కాని కథ సెట్టవ్వకపోవడం వలన ఆ ప్రాజెక్టు చర్చల దశలోనే ఆగిపోయింది. ఇక మరోసారి పవన్ కళ్యాణ్ కు కథ చెప్పడానికి ఈ దర్శకుడు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తప్పకుండా పవర్ స్టార్ తో సినిమా ఉంటుందని అలాగే కందిరీగ 2 కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. మరి ముందు సంతోష్ శ్రీనివాస్ ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి.