Sai Dharam Tej : రోజుల తరబడి, నెలల తరబడి.. సాయిధరమ్ తేజ్ ఇంటికే ఎందుకు పరిమితమైపోయాడు.. బయటకొచ్చినా మీడియాతో ఎందుకు మాట్లాడలేకపోయాడు.? ఇలా చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయ్.. పుట్టుకొస్తూనే వున్నాయ్. ఇంకా ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు.
రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాల పాలై, తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న సాయి ధరమ్ తేజ్ చాలా రోజులపాటు, చాలా నెలలపాటు ఇంటికే పరిమితమయ్యాడు. అసలు సాయిధరమ్ తేజ్ వాస్తవ ఆరోగ్య పరిస్థితి ఏంటి.? అన్నది తెలియక అభిమానులు ఇప్పటికీ తీవ్ర ఆందోళన చెందుతూనే వున్నారు.
ఎలాగైతేనేం, సాయిధరమ్ తేజ్ నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది. తాను క్షేమంగానే వున్నానని చెప్పాడు సుప్రీం హీరో. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వుండమన్నాడు, హెల్మెట్ ధరించాలనీ కోరాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి, పేరు పేరునా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పాడు. తోటి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా తాను కోలుకోవాలని కోరుకున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
తనకు మరో కుటుంబం అయిన అభిమానులకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు సాయిధరమ్ తేజ్. త్వరలో తాను నటించబోయే కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని ప్రకటించాడు. సో, అనుమానాలన్నిటికీ నివృత్తి కలిగినట్టే. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు.
అయితే, సాయిధరమ్ తేజ్ శరీరంపై గాయాలకు సంబంధించి గుర్తులు కొన్ని అలాగే వుండిపోయాయ్. జరిగింది చిన్న ప్రమాదం కాదు మరి.!