RRR : ఆర్ఆర్ఆర్ సినిమాపై ‘ఆ వివాదం’.! గట్టెక్కేదెలా.?

RRR : ‘మనోభావాలు’ అనేది దాదాపు ప్రతి సినిమా విడుదల సమయంలోనూ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయ్..’ అంటూ కొందరు మీడియాకెక్కుతున్నారు. పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు.

మొన్నీమధ్యనే ‘భీమ్లానాయక్’ సినిమా విషయమై కొందరు నానా యాగీ చేశారు. ఆ యాగీ వల్ల ‘భీమ్లానాయక్’ సినిమాకి అదనపు పబ్లిసిటీ వచ్చిపడింది తప్ప, నష్టమైతే లేదు. నిజానికి, కొన్ని సినిమాల విషయంలో కొందరు కావాలనే ‘మనోభావాల’ పేరుతో రచ్చ చేసి ఆయా సినిమాలకు పబ్లిసిటీ చేస్తున్నారనీ, ఇలాంటివారిని కొందర్ని ప్రత్యేకంగా కొందరు నిర్మాతలు లేదా పీఆర్వోలు ఎంగేజ్ చేస్తుంటారనీ తరచూ పుకార్లు తెరపైకొస్తుంటాయి. అందులో నిజమెంత.? అన్నది మాత్రం తేలాల్సి వుంది.

తాజాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద మనోభావాలంటూ రచ్చకెక్కుతున్నారు కొందరు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమరయోధుడనీ, ఆయన్ని కించపర్చేలా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తీశారనేది వారి ఆరోపణ. అసలు సినిమా విడుదల కాలేదు.. అందులో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎలా వుంటుంది.? అసలు వుంటుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ, ఈలోగా మనోభావాల వివాదం తెరపైకొచ్చేసింది.

కొన్నాళ్ళ క్రితం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీయార్ మీద కూడా ఇలాంటి రగడే జరిగింది.