నిన్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో ఒకదాన్ని రిలీజ్ చేశారు రాజమౌళి. అంతా అనుకున్నట్టే మేకింగ్ వీడియో వేరే లెవల్లో ఉంది. సినిమా గ్రాండ్నెస్ ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియోను రూపొందించారు. భారీ సెట్టింగ్స్, వందల మంది క్రూ, స్టార్ నటీనటులు, కాస్ట్లీ ఎక్యూప్మెంట్ ఇలా అన్ని విషయాలను పూసగుచ్చినట్టు చూపించారు. మేకింగ్ వీడియోలో రాజమౌళి అండ్ టీమ్ పడుతున్న కష్టం ఎంత పెద్దదో, ఎన్ని వ్యయప్రయాలకి ఓర్చి సినిమాను తెరకెక్కిస్తున్నారో అర్థమవుతోంది. అన్నింటినీ మించి ప్రధాన పాత్రధారులు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్ళకి కట్టింది.
ఇక జక్కన్న పర్ఫెక్షన్ గురించి చెప్పనక్కర్లేదు. మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గలేదు ఆయన. ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లుప్తంగా తెరకెక్కిస్తున్నారని మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సాలిడ్ ట్రైలర్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందో అలాంటి కంటెంట్ ఉంది ఈ మేకింగ్ వీడియోలో. మరి మేకింగ్ వీడియోనే ట్రైలర్ తరహాలో ఉంటే ఇక ట్రైలర్ ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ అనిపిస్తున్నాయి. సుమారు 300 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను అన్ని భాషల్లో అక్టోబర్ 13న విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.