Rajamouli : చరణ్, ఎన్టీయార్ అభిమానులు ఒక్కటయ్యారా.? లేదా.?

Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’ ఓ సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి. సినిమా కథ అనుకున్నప్పుడు, చరణ్ అలాగే ఎన్టీయార్‌తో కలిసి చేయాలనుకున్నప్పుడు.. ఆ ఇద్దరి మధ్య స్నేహమే తనకు గుర్తుకు వచ్చిందని పదే పదే చెబుతూ వస్తున్నాడు జక్కన్న రాజమౌళి.

ఇద్దరు స్టార్ హీరోలతో.. అందునా, అభిమానులు నిత్యం ‘జాతి వైరం’తో రగిలిపోయే ఇద్దరు ప్రముఖ హీరోల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించడం అంత ఈజీ కాదంటూ బోల్డన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హిందీ సినీ పరిశ్రమలోనూ అలాంటివి వున్నాయి.. కానీ, అభిమానులు మల్టీస్టారర్ సినిమాల్ని ఆదరించారక్కడ.

తెలుగునాట ఎమోషన్స్ వేరు. ఇక్కడి అభిమానుల కొట్లాటలు వేరే లెవల్. ఆ విషయం రాజమౌళికి తెలియదా.? తెలుసు. అందుకే, మొదటి నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. తాజాగా ‘బిగ్ బాస్ రియాల్టీ షో’ వేదికగా కూడా, ‘ఇద్దరు అగ్ర హీరోల అభిమానుల్ని కలిపేశా..’ అన్న ఆనందం ఆయనలో కనిపించింది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి స్నేహమే పునాది. సినిమా కథ కూడా అదే. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు.. అనే ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తుల మధ్య స్నేహం వుంటే ఎలా వుంటుంది.? అన్న కోణంలో సినిమా తెరకెక్కించాడు రాజమౌళి. చరణ్, రాజమౌళి సినీ రంగంలో పవర్‌ఫుల్ స్టార్స్. ఆ ఇద్దర్నీ అభిమానించే వారి వారి అభిమానుల మధ్య అంతే పవర్‌ఫుల్ ఆధిపత్య పోరు కూడా వుంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా వర్కవుట్ అవ్వాలంటే, ముందుగా ఈ ఇద్దరు హీరోల అభిమానులూ ఒక్కటవ్వాల్సి వుంటుంది. ఆపై, తెరమీద రాజమౌళి ఎంత గొప్పగా కథను ఆవిష్కరించాడన్నదానిపై సినిమా ఫలితం ఆధారపడి వుంటుంది. అభిమానులైతే ఇప్పటికీ సోషల్ మీడియాలో, ‘మా హీరో గొప్ప.. మా హీరోనే గొప్ప..’ అని కొట్టుకుంటూనే వున్నారు.