అటు కరోనా.. ఇంకో వైపు పెట్రో ధరల వాత.!

Petrol Hike Along With Corona Pandemic

Petrol Hike  Along With Corona Pandemic

దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, మినీ లాక్ డౌన్, కర్ఫ్యూ.. ఇలా రకరకాల పరిస్థితులున్నాయి. దాంతో, రోడ్ల మీద వాహనాల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. ఆ లెక్కన, పెట్రోలు అలాగే డీజిల్ వినియోగం తగ్గుతున్నట్లే కదా. డిమాండ్ ఎలాగూ తగ్గింది. ఇంకోపక్క, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఏమీ లేవు. అయినాగానీ, దేశంలో మళ్ళీ పెట్రో ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ అలాగే డీజిల్ మీద వాత గత కొద్ది రోజులుగా మళ్ళీ షురూ అయ్యింది. అదేంటో, ఎన్నికలొస్తే.. పెట్రో ధరల పెరుగుదల ఆగిపోతుంటుంది. ఎన్నికల ఫలితాలు రాగానే, మళ్ళీ వాత మొదలవుతుంటుంది. ప్రపపంచంలో ఎక్కడా లేని వింత పరిస్థితి మన దేశంలోనే.

భారతదేశ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో ఏమోగానీ, పాలకులు మాత్రం.. పెట్రో శిక్ష విధించడంలో అస్సలేమాత్రం జాలీ, దయా చూపడంలేదు. ఓ వైపు కరోనా ముంచేస్తోంటే, ఇంకో వైపు పెట్రో వాత జనాన్ని భయపెడుతోంది. దోచుకోవడంలో మరీ ప్రభుత్వాలు ఇంత నిర్దయగా ఎలా వ్యవహరిస్తున్నాయి.? అన్నదే సామాన్యడి ప్రశ్న. ‘ప్రభుత్వాలు వ్యాపారం చెయ్యవు..’ అని ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేశారు. మరి, పెట్రో ధరల వాత సంగతేంటి.? రికార్డు స్థాయిలో పెట్రో ఉత్పత్తులపై పన్నులేసి, వ్యాపారం చెయ్యడంలేదంటే ఎలా.? తమ సొంత పబ్లసిటీ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, ఆ పబ్లిసిటీ ఖర్చు తగ్గించుకుంటే, పెట్రో ధరల నుంచి ఉపశమనం కల్పించొచ్చు. నిజానికి, కరోనా పాండమిక్ పరిస్థితుల్లో సామాన్యుడ్ని ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. కానీ, గోరు చుట్టు మీద రోకలి పోటు.. అన్న చందాన, సామాన్యుడ్ని పీల్చి పిప్పి చేసెయ్యడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుండడం శోచనీయం.