Mr Lokesh : మిస్టర్ నారా లోకేష్.. చంద్రబాబు చేసింది కూడా అదేనా.?

Mr Lokesh : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడంపై నారా లోకేష్ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు. అదీ ట్విట్టర్ ద్వారా. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకా.? లెక్కలు చెప్పకుండా చేసిన అప్పుల వ్యవహారంలో చీవాట్లు పడకుండా వుండేందుకా.? అంటూ మొత్తంగా ఓ నాలుగు ప్రశ్నలు వేసేశారు నారా లోకేష్.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానిని కలవడంలో తప్పేముంది.? రాష్ట్ర ప్రయోజనాలపైనే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి మధ్య చర్చలు జరుగుతాయి. రాజకీయ కోణంలో అయితే, దానికి వేరే వేదికలు వుంటాయి.
అధికారిక సమావేశాల్లో వ్యక్తిగత అంశాలు చర్చకు వస్తాయా.? అంటే, ఏమో.. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వ్యక్తిగత అంశాలపై చర్చలు జరిపి, వాటిని అధికారిక పర్యటనలుగా బుకాయించారేమో.. నారా లోకేష్ సమాధానం చెప్పాల్సి వుంటుంది.
ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ కేంద్రాన్ని అడుగుతారు. అలా అడగడంలో తప్పేముంది.? అడగడం కాదు, నిలదీయాలి.. అని టీడీపీ డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టలేం.
పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడిగితే దాన్నెలా టీడీపీ తప్పు పడుతుంది.? అంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తవడం టీడీపీకి ఇష్టం లేదనే అనుకోవాలి.
అప్పుడు చంద్రబాబు అయినా, ఇప్పుడు వైఎస్ జగన్ అయినా.. ఎవరు అధికారంలో వున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు వున్నా.. రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదన్నది నిర్వివాదాంశం.
మిత్రపక్షంగా వుంటూ కూడా టీడీపీ, అప్పట్లో బీజేపీని రాష్ట్ర ప్రయోజనాల విషయమై ఒప్పించలేకపోయింది.
వైఎస్ జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.. వాటికి వీలైతే టీడీపీ తనవంతు సహకారం అందించాలి తప్ప, ఇదేం రోత రాతలు.?