నిర్మలమ్మ నీతులు.. సామాన్యులకేవీ ఆర్థిక వెసులుబాట్లు.?

nirmala sitharaman

nirmala sitharaman

కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. రిజర్వు బ్యాంకు, రాష్ట్రాలకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తోంది. కేంద్రం అయితే, అప్పులు చేయడానికి కొత్తదార్లు వెతుక్కుంటోంది. వాటితోపాటు, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టేసింది. ఇంకోపక్క, కరోనా నేపథ్యంలోనూ సామాన్యుడి నడ్డివిరిచేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతే తప్ప, సామాన్యుడేమైపోతున్నాడు కరోనా కారణంగా.? అన్న ఇంగిత జ్నానం మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో కనిపించడంలేదు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మీడియా ముందుకొస్తే చాలు ఆర్థిక పాఠాలు అనర్గళంగా వల్లెవేస్తుంటారు. సామాన్యల్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని సెలవిస్తారు. కానీ, ఏదీ ఎక్కడ.? కరోనా నేపథ్యంలో సామాన్యుడికి కేంద్రం కల్పించిన వెసులుబాట్లు ఏంటి.? మొదటి వేవ్ సందర్భంగా మారటోరియం ప్రకటించింది కేంద్రం. ఆ మారటోరియం సామాన్యుడికి ఉపయోగపడలేదు సరికదా, మరింతగా సామాన్యుడి నడ్డి విరిగిపోయింది. అయినాగానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకోసారి మారటోరియం ప్రకటించాలనే వాదన తెరపైకొస్తోంది. నిజమే మరి, తర్వాత నడ్డి విరిగిపోయినాసరే.. ప్రస్తుతం ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి కాస్త ఉపశమనం కోరుకోవడం అనేది సామాన్యుడి ముందున్న ఏకైక ఆప్షన్. అయితే, మారటోరియం ఆలోచన కేంద్రానికి వున్నట్టు కనిపించడంలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. మరెలా లోన్లను చెల్లించేది.? ఇదీ సామాన్యుడి ప్రశ్న. ఎవరికైనా కరోనా సోకితే, ఆ కుటుంబం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమే. అప్పుల్ని తలచుకుని ముందే కొన్ని గుండెలు ఆగిపోతున్నాయ్. కరోనా మరణాల కంటే, ఈ ఆర్థిక సమస్యల కారణంగా చోటు చేసుకుంటోన్న మరణాలే ఎక్కువన్నది ఓ అంచనా. అయినా, కేంద్రం చలించబోదు. ఎందుకంటే, కేంద్రానికి సామాన్యడి కష్టాలతో పనిలేదు.