మోడీ సర్కారు ‘పెట్రో’ కథ అట్టర్ ఫ్లాప్.!

వడ్డీ కట్టేందుకేమో సుమారు 70 కోట్లు ఖర్చు చేశారట.. అసలు మాత్రం 3 వేల కోట్లే తీర్చారట. యూపీఏ హయాంలో పెట్రో ధరల వ్యవహారానికి సంబంధించి సమర్పించిన బాండ్ల తాలూకు వ్యవహారం ఇదట. అలాగని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. ఇంకో నాలుగైదేళ్ళలో అసలు, వడ్డీ కలిసి తీర్చెయ్యాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. ఏడేళ్ళలో వడ్డీ 70 వేల కోట్ల పైన తీర్చారంటే, అసలు కూడా ఆ స్థాయిలో తీరి వుండాలి కదా.? అన్నది సామాన్యుడి వాదన. కేంద్రం చెప్పే లెక్కలకీ, వాస్తవ పరిస్థితులకీ అస్సలు పొంతన వుండదు. కాగా, గడచిన ఏడేళ్ళలో 22 లక్షల కోట్ల రూపాయల్ని పెట్రో ఉత్పత్తుల మీద పెంచిన పన్నుల కారణంగా కేంద్రం సమీకరించిందనీ, యూపీఏ హయాంలో బాండ్ల విలువ దాదాపు లక్షన్నర కోట్లు మాత్రమేననీ కాంగ్రెస్ పార్టీ అంటోంది. కాంగ్రెస్ అనడం కాదు, వాటికి సంబంధించిన లెక్కలూ కనిపిస్తున్నాయి.

అంటే, 22 లక్షల కోట్లని ప్రజల నుంచి లాగేసినా లక్షన్నర కోట్ల బాండ్లను వదిలించుకోలేకపోవడం, పైగా.. వేల కోట్లు వడ్డీ కడుతుండడమంటే.. కేంద్రం, దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పదలచుకున్నట్టు.? దేశంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి. ఇందులో కేంద్రం పాపం, రాష్ట్రాల పాపం.. రెండూ కలిసే వున్నాయి. ప్రజలంటే కనీస బాధ్యత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో పన్నులతో బాదేస్తున్నాయన్న విమర్శ సర్వత్రా వెల్లువెత్తుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు.. అప్పటి యూపీఏ సర్కార్ రెండ్రూపాయలో, మూడు రూపాయలో పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచితే.. గగ్గోలు పెట్టిన ఘన చరిత్రని చూశాం. మరిప్పుడు.. పెట్రోల్ ధర ఏకంగా 100 దాటేసింది. ధరలు తగ్గించడంలేదు సరికదా.. అవతల, బాండ్లను కూడా విడిపించకుండా.. దేశ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నట్టు.? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయమై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది.