తగ్గేదే లేదంటున్న లోకేష్.. ఇదే తగ్గించుకుంటే మంచిది.!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేత పట్టాభి దూషణల ఫలితమది. రాజకీయాల్లో విమర్శలు సహజమే.. విమర్శించినంతనే, దాడులు చేస్తారా.? అది సమర్థనీయం కాదు. అయినాగానీ, ఇప్పుడు రాజకీయాలే అలా తగలడ్డాయ్.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ మరోమారు వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సైకో రెడ్డి.. అన్నారు.. ఇంకేవేవో విమర్శలు ముఖ్యమంత్రి మీద చేశారు. అంతేనా, ‘మేం అధికారంలోకి వచ్చాక మీ వీపులు పగులుతాయ్..’ అని హెచ్చరించారు. ఇదెక్కడి సంస్కృతి. వైసీపీ తీరుని తప్పు పడుతున్నప్పుడు, ఈ దిగజారుడు వ్యాఖ్యలేంటి.?

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. వైసీపీ కార్యకర్తలు చేసింది ముమ్మాటికీ తప్పే. తప్పు మాత్రమే కాదు, అంతకు మించి అది పెద్ద నేరం. దీనిపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. నిజానికి, ఇక్కడ పోలీసు శాఖ వైఫల్యం సుస్పష్టం.

ఆ విషయాన్ని పక్కన పెడితే, నారా లోకేష్ హెచ్చరికలు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నాయన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. నాయకులు వివేకం కోల్పోతున్నారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. టీడీపీకి చెందిన చాలామంది నేతలదీ అదే తీరు.

అంతిమంగా రాష్ట్రం చెడ్డపేరు మూటగట్టుకుంటోందన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు.అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. వ్యక్తిగత వైరాలుంటే.. అది వేరే అంశం. రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టించేలా ఎవరు వ్యవహరించినా అది సమర్థనీయం కాదు.