తెలంగాణ సీఎం కేసీఆర్ ముక్కుసూటి మనిషి. గొడవంటూ వస్తే ఎవరినైనా ఎదురుగా వెళ్లే ఢీకొడతారు తప్ప పక్క దారులు ఉండవు అంటూ ఆయన గురించి అభిమానులు గొప్పగా చెబుతుంటారు. అందుకు బెస్ట్ ఉదాహరణగా చంద్రబాబును చూపుతారు. తనతో పెట్టుకున్న బాబును రాజధానిగా వాడుకోవాల్సిన హైదరాబాద్ ను వదిలిపోయేలా చేశారని పెద్ద కథే చెబుతుంటారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ వైఖరి చూస్తే ఆయన ముక్కుసూటితనంతా ఒక్క చంద్రబాబుకే పరిమితమని అనిపిస్తోంది జనానికి. మామూలుగా అయితే నదీ జలాల విషయానికొస్తే కేసీఆర్ రియాక్ట్ అయ్యే తీరు వేరేలా ఉంటుంది. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే జలాల కోసమని చెప్పే కేసీఆర్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పొలిటికల్ ఫైట్ వచ్చినా ఆ సెంటిమెంట్ మీదే నడిచేవారు.
మన జలాలను దోచుకుపోయిన ఆంధ్రా నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ తెలంగాణ ప్రజల్లో ఆవేశాన్ని పుట్టించేవారు. ఫలితంగా తెలంగాణ జనం చంద్రబాబును నాయుడును ఎంతలా బహిష్కరించారో మనకు తెలుసు. కానీ వైఎస్ జగన్ విషయంలో మాత్రం ఆ తరహా మాటలు మాట్లాడటంలేదు కేసీఆర్. ఇరు రాష్ట్రాల నడుమ కొన్ని నెలలుగా కృష్ణ, గోదావరి జలాల విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తమకు జరిగిన కేటాయింపుల మేరకే శ్రీశైలం ఎగువన ప్రాజెక్ట్ కట్టి రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకెళ్లాలని అంటోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మొదలైన వివాదం తెలంగాణ నిర్మిస్తున్న పలు నీటి ప్రాజెక్టులు అక్రమమనే స్థాయికి వెళ్ళిపోయింది.
ఇదే గొడవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగి ఉంటే ఆయనే గనుక కాళేశ్వరం సహా తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమని అని ఉంటే కేసీఆర్ ఉగ్రరూపం చూపేవారు. చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు సర్కార్ అంటూ ఏపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవారు. కానీ జగన్ విషయంలో మాత్రం అలా చేయడంలేదు. వివాదంలో ఎక్కడా జగన్ సర్కార్ అని, జగన్ ప్రభుత్వం అనికానీ అనడంలేదు. కేవలం ఏపీ ప్రభుత్వం అనే అంటున్నారు. దీన్నిబట్టి జగన్ మీద బ్లాక్ మార్క్ పడకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరి జగన్ పట్ల ఇంత సున్నితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ 6న జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ మీద ఎలా మాట్లాడతారో చూడాలని జనం ఆసక్తిగా ఉన్నారు.