తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా సన్నద్ధమవుతున్న వేళ ఆయనకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఎంతో సులభంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీ తెచ్చుకోవచ్చని అనుకున్న ఆయన ఆశలు మీద కాంగ్రెస్ పార్టీ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి కలిసి నీళ్లు చల్లేశారు. అలాగే అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ప్రొఫసర్ నాగేశ్వర్ బరిలోకి దిగుతుండటంతో అక్కడా గెలుపు అవకాశాలు 50 శాతానికి పడిపోయాయి. వీటన్నిటికంటే అతి ముఖ్యమైన గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ సీట్లు దక్కించుకోవాలనుకున్న తెరాసకు ఈసారి బలమైన పోటీ ఎదురుకానుంది.
గత ఎన్నికల్లో తెరాసా 99 సీట్లు దక్కించుకోగా బీజేపీ 4 స్థానాలకు పరిమితమైంది. కానీ ఈసారి అలా కాదు. భారతీయ జనతా పార్టీ బలపడింది. ఆ బలం ఎంతో బేరీజు వేయడం కష్టమే కానీ తప్పకుండా గతం కంటే ఎక్కువ సీట్లే గెలుచుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన సైతం గ్రేటర్ బరిలోకి దిగనుండటం తెరాసకు మింగుడుపడటంలేదు. జనసేన తప్పకుండా బీజేపీతో కలిసే కొన్ని స్థానాల్లో పోటీకి దిగుతుంది. ఈ సంగతి అలా ఉంచితే ఆంధ్రా సెటిలర్ల అంశమే తెరాసకు ఆందోళన కలిగిస్తోంది. కారణం ఏపీ, తెలంగాణల నడుమ రాజుకున్న జలవివాదం చిలికి చిలికి గాలివాన అయింది. కేసీఆర్ జగన్ మీద విమర్శలు గుప్పిస్తూ నీళ్లు ఎలా తీసుకుంటారో చూస్తాననే ధోరణిలో ఉండటం ఆంధ్రావాసులకు అందులోనూ జగన్ అభిమానులకు అంతగా నచ్చట్లేదు.
అందుకే ఇన్నాళ్లు జగన్ స్నేహం చూసి కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలనుకున్న వారందరూ ఈసారి మొహం చాటేసే అవకాశం లేకపోలేదు. వారి ఓట్లను తమవైపు తిప్పికోగల పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ జగన్ అభిమానులు మద్దతు ఇవ్వరు. ఇక టీడీపీ ఎన్నికల్లో నిలిస్తే కన్నెత్తి కూడా చూడరనే విషయం సుస్పష్టం. ఇక మిగిలిందల్లా జనసేన, బీజేపీలే. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రభావం కనబడకపోవచ్చు కానీ నగర ఎన్నికలు కాబట్టి తప్పకుండా పవన్ ఇమేజ్ పనిచేస్తుంది. పైపెచ్చు బీజేపీ, జగన్ మధ్యన సానుకూల వాతావరణం నడుస్తోంది. ఈ కారణాల మూలంగా జగన్ మద్దతుదారులను జనసేన, బీజేపీలు ప్రభావితం చేసే అవకాశం పుష్కలంగా ఉంది.