జగన్ సర్కార్ ఏడాది పాలనపై ప్రతిపక్షం టీడీపీ నేతల మాటలు హద్దుల దాటిన సంగతి తెలిసిందే. రాజకీయాలలో ఇలాంటి మాటలు సహజమే అయినప్పటికీ జగన్ సర్కార్ వీటిని సీరియస్ గానే తీసుకున్నట్లు అనిపిస్తోంది. గడిచిన ఏడాదిలో ఇసుకు, నీరు- మీరు, రాజధాని స్కాం, ఈఎస్ఐ స్కాంల కు సంబంధించి అధికార పక్షాన్ని ప్రతిపక్షం పదే పదే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తాజాగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాల్లో అరెస్ట్ లు ఏ విధంగా చేస్తారో? చూస్తాం! దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ టీడీపీ పెద్దలు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం వల్లే అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు. మును ముందు ఇలాంటి అరెస్ట్ లు చాలానే ఉంటాయని అన్నారు.
వాస్తవంగా వైకాపా ప్రభుత్వం మరో ఏడాది పాటు టీడీపీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోకుండా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ప్రజల సంతృప్తిని పొందాలని భావించిందని, కానీ రెచ్చ గొట్టే వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం తన ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేకుంటే వైకాపా ప్రభుత్వం ఇంత వేగంగా టీడీపీ నేతల్ని టార్గెట్ చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏడాదిగా మరుగున పడేసిన రాజధాని భూములు, ఈఎస్ ఐ స్కాంల అంశాలను ఒక్కసారిగా తెర మీదకు తీసుకొచ్చి టీడీపీ అవినీతిని నిరూపించడం ద్వారా ప్రజల్లో మరోసారి జగన్ సర్కార్ తన ఉనికిని చాటుకుందని అభిప్రాయపడ్డారు.
ఇది ప్రతిపక్షానికి ఓ హెచ్చరింపులా ఉంటుందని అంటున్నారు. ఇకపై ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే? ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడుతారన్నారు. టీడీపీ నేతల అవకతవకలు, అవినీతికి పాల్పడింది కాబట్టే జగన్ డేర్ గా ఎటాక్ కి దిగారని అంటున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే వాటిపై టీడీపీ హుందాగా నడుచుకుని, తెలివిగా జగన్ అండ్ కోని ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసారని అభిప్రాయపడ్డారు.