దేశానికి ఆక్సిజన్ కావాలి. ఔను, దేశం ఇప్పుడు ఆక్సిజన్ కోసం విలవిల్లాడుతోంది. అవసరమైన మేర దేశంలో ఆక్సిజన్ వుందా.? అంటే, మామూలుగా దొరికే ఆక్సిజన్ కాదిది. మెడికల్ ఆక్సిజన్. కరోనా సెకెండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారిన దరిమిలా, ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువవుతోంది. పరిశ్రమలకు వాడే ఆక్సిజన్ పూర్తిగా వైద్య అవసరాల కోసమే వినియోగిస్తే తప్ప, ప్రజల ప్రాణాల్ని కాపాడలేని పరిస్థితి. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్ తరలించేందుకు ప్రత్యేక వాహనాల్ని, రైళ్ళ ద్వారా రాష్ట్రాలకు చేర్చుతున్నామని కేంద్రం అంటోంది. మరోపక్క, ఆక్సిజన్ సిలెండర్ల దొంగలూ ఎక్కువైపోయారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆక్సిజన్ కొరతతో విలవిల్లాడుతోంది.
రాత్రికి రాత్రి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నిజానికి, మొదటి వేవ్ తర్వాత, కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి వుండాల్సింది. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో సెకెండ్ వేవ్ ఖచ్చితంగా వస్తుందన్న నిపుణుల అంచనాల్ని కేంద్రం లైట్ తీసుకోవడమే ఈ సమస్యకు కారణం. గొప్పలకు పోయి, కరోనా చికిత్సలో వాడే చాలా మందులు, ఇతర పరికరాల్ని విదేశాలకు ఎగుమతి చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే అసలు సమస్యగా మారిందిప్పుడు. మన అవసరాల్ని తీర్చేందుకు ఇప్పుడు ఏ దేశమూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. రోజుకి 3 లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయిప్పుడు. ముందు ముందు ఇంకా పెరగొచ్చు. నిన్న ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య తలెత్తి 22 మందిరోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి ముందు ముందు ఇంకెన్ని వినాల్సి వస్తుందో. నరేంద్ర మోడీ ప్రధానిగా ఎదుర్కొంటోన్న అతి పెద్ద ఫెయిల్యూర్ ఇది.