దేవాలయాల నుంచి ఆదాయం పెంచడం ఎలా.?

మసీదుల నుంచి ప్రభుత్వాలకు ఆదాయం రాదు. చర్చిల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం లేదు. కానీ, దేవాలయాల నుంచి మాత్రం ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంటుంది. మసీదుల్లో టిక్కెట్లుండవ్.. చర్చిలకూ టిక్కెట్ల అవసరమే వుండదు. కానీ, దేవాలయాల్లో ఎంట్రీకి మాత్రం టిక్కెట్ వుంటుంది. ఉచిత దర్శనం వున్నప్పటికీ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల పేరుతో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. ఈ విషయమై హిందూ సమాజం ఎంత ఆందోళన చెందుతున్నా, పాలకులకు కనీసపాటి బాధ్యత వుండదుగాక వుండదు. సరే, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? అన్న విషయాన్ని పక్కన పెడదాం. కరోనా పేరుతో దేవాలయాలకు ఆదాయం పడిపోయిందంటూ తెలుగు మీడియా తెగ బాధపడిపోతోంది. దేవాలయాల ఆదాయాల్ని పెంచే మార్గాల కోసం ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయంటూ కొత్త ప్రచారానికి తెరలేపాయి.

నిజమేనా.? ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచిస్తోందా.? అంటే, ‘కాదు’ అని చెప్పలేం. అదనపు ఆదాయమెలా వస్తుంది.? భక్తుల్ని బాదెయ్యాల్సిందే. దేవాలయాల్లో భక్తులకు ప్రసాదం ఇచ్చేందుకు, దేవాలయాల్లో కైంకర్యాల కోసం రాజుల కాలం నుంచీ ఎన్నెన్నో దాన ధర్మాలు జరిగాయి. దేవాలయాలకి బోల్డన్ని ఆస్తులున్నాయి. వాటి ద్వారా దేవాలయాలకి బోల్డంత ఆదాయం సమకూరుతోంది. అయినా, ఇదేదీ సరిపోవడంలేదా.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే. దేవాదాయ శాఖ.. అన్న పేరులోనే, ‘దేవుడు – ఆదాయం’ కలగలిసి వున్నాయి. దేవుడి పేరు చెప్పి, ఆదాయాన్ని సమకూర్చుకోవడమేంటి పిచ్చి కాకపోతే.? ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ఎవరు అధికారంలో వున్నా అదే తంతు. దేవాలయాల మీద రాజకీయ నిరుద్యోగులు ఆధారపడి వున్నారు. అందుకే పాలక మండళ్ళలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సభ్యులుగా అవకాశం. అందుకే, దేవాలయాల పేరుతో హిందువులకు నిలువుదోపిడీ అవుతోందన్న వాస్తవాన్ని ఎలా కాదనగలం.?