నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెర్సెస్ ఏపీ ప్రభుత్వం.. ఈ ఫైట్ ప్యూర్ ఈగో ప్రాబ్లమ్. ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనే తపనే తప్ప ఇందులో ఇంకొకటి లేదు. రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఘర్షణ పడితే ఎలా ఉంటుందనే విషయానికి భష్యత్తులో ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తుందే తప్ప ఈ నిజంగా ఎవరి తప్పూ లేకుండా ప్రభుత్వానికి, రాజ్యాంగ వ్యవస్థకు ఘర్షణ జరిగే వీలుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేది కాదు. ఇక ఈ గొడవలో ఎక్కువసార్లు పైచేయి సాధిస్తూ వచ్చింది నిమ్మగడ్డే. పలుమార్లు కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. చివరకు సుప్రీం కోర్టు ఎన్నికలు పెట్టుకోవచ్చని చెప్పడంతో ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది.
సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది కదా అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును పూర్తిగా స్వాగతించలేం. మొదటి నుండి ఆయన చేయాల్సిన దానికంటే ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రతిదాన్నీ పర్సనల్ చేసుకుంటున్నారు. ఇది ఎన్నికల కమీషన్ యొక్క సమస్యలా కాకుండా నిమ్మగడ్డ వ్యక్తిగత సమస్య అన్నట్టు ప్రొజెక్ట్ చేసేందుకు తపన పడ్డారు. దీని మీదనే హైకోర్టు చురకలు వేసింది. ఎస్‌ఈసీకి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత ఏడాది నవంబరు 3న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కానీ ఆ ఉత్తర్వులను పాటిచలేదని నిమ్మగడ్డ డిసెంబర్ 18న కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ గురించి అప్పట్లో మీడియాకు పూర్తి లీకులు అందాయి. విచారణ జరగకుండానే అన్నీ బయటికొచ్చాయి.
ఆ తర్వాత ఆ పిటిషన్ మీద ఈసీ దృష్టి పెట్టలేదు. సుమారు 42 రోజులుగా పిటిషన్ మీద విచారణ జరగలేదు. కానీ ఉన్నట్టుండి ఈసీ ఈ పిటిషన్ మీద విచారణ జరపాలని కోర్టును కోరారు. ధిక్కార వ్యాజ్యం 42 రోజులు విచారణకు నోచుకోకపోతే ఎస్‌ఈసీ ఎందుకు కోర్టుకు రాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం పిటిషన్ దాఖలు చేశారా లేకపోతే కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిజంగానే అధికారులు అమలు చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు విచారణ కోరడం ప్రతివాదుల మీద ఒత్తిడి తేవడానికేనా అంది. అంతేకాదు విచారణకు అంత తొందరేమీ లేదన్నట్టు తదుపరి విచారణను 15కు వాయిదా వేసింది. ఈసారి హైకోర్టు వ్యవహరించిన తీరు చూస్తే నిమ్మగడ్డకు వ్యక్తిగత ప్రచారం మీద ఉన్న యావను హెచ్చరిస్తున్నట్టే ఉంది. ఇది జగన్ ప్రభుత్వానికి హర్షించదగిన విషయమే.