Montha Cyclone: తుపాన్ బాధితులకు తక్షణం సాయం – సీఎం చంద్రబాబు

మొంథా తుపాన్ (Montha Cyclone) సృష్టించిన బీభత్సం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తక్షణ సహాయక, పునరుద్ధరణ చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ‘యుద్ధప్రాతిపదికన’ పనిచేయాలని ఆదేశించారు.

తక్షణ సహాయం, పునరుద్ధరణపై సీఎం ఆదేశాలు నిత్యావసరాల పంపిణీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు తుపాన్ ప్రాంతాల్లో పర్యటించి, ప్రభుత్వ సహాయక చర్యలను ప్రజలకు వివరించాలని, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. మొంథా తుపాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 10 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని సీఎం తెలిపారు.

అధికార యంత్రాంగానికి సీఎం అభినందనలు: గత నాలుగైదు రోజులుగా మొంథా తుఫాన్‌ను ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. “ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అంతా ఒక బృందంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు” అని ఆయన తెలిపారు. మరో రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే బాధితులకు మరింత ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నష్ట తీవ్రతను చాలా వరకు తగ్గించగలిగామని సీఎం అభిప్రాయపడ్డారు.

సచివాలయ మైక్ అనౌన్స్‌మెంట్: “ఈసారి సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశాం. ఇది ఒక నూతన విధానం,” అని ఆయన వివరించారు.

డ్రైన్ల శుభ్రత: మున్సిపాలిటీల్లో డ్రైన్లు శుభ్రం చేయడం వల్ల కాలనీలు ముంపునకు గురికాలేదని ఆయన వెల్లడించారు.

ఈ తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, తమ చర్యలతో ప్రజల్లో భరోసా పెరిగిందని చంద్రబాబు అన్నారు.

Cyclone Montha: Face To Face With NDRF Team | Telugu Rajyam