ప్ర‌జ‌ల‌కు బిస్కెట్లు వేస్తూ కెమిక‌ల్ కంపెనీల భోగోతమిదీ!

వైజాగ్ – గోపాల‌ప‌ట్నం గ్యాస్ లీక్ దుర్ఘ‌ట‌న దేశవ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది మృత్యువాత ప‌డ‌గా.. వంద‌ల మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాల‌కు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోటి ఎక్స్ గ్రేషియో ప్ర‌క‌టించి ఇత‌రుల‌కు ఆర్థిక సాయం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్యాస్ లీక్ కి కార‌ణ‌మైన ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ రూ.50 కోట్లు బాధిత ప్ర‌జ‌ల‌కు చెల్లించాల‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల డిమాండ్ తెలిసిందే. అయితే ఈ ఘోరం త‌ర్వాత కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు ఉన్న ప్ర‌తిచోటా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏ ప్ర‌మాదం ఎట్నుంచి పొంచి ఉందోన‌న్న ఆందోళ‌న కంటికి కునుకు ప‌ట్ట‌నీకుండా ఉంది. అంతేకాదు.. ఆయా ప్రాంతాల్లో యువ‌త‌రంలో ఇప్ప‌టికే వాట్సాప్ వేదిక‌లుగా బోలెడంత డిబేట్ సాగుతోంది. ఏపీలో తీర‌ప్రాంతం వెంబ‌డి ప్ర‌ముఖ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవి నిరంత‌రం ర‌సాయ‌న వాస‌న‌లు వెద‌జ‌ల్లుతుంటాయి. హెటిరో.. డెక్క‌న్ కెమిక‌ల్ లాంటి భారీ ఫ్యాక్ట‌రీలు ఉన్నాయి. అస‌లు కెమిక‌ల్ ఫ్యాక్టరీ హ‌బ్ ఉన్న చోట ప్ర‌భుత్వాలు ఎలాంటి స‌దుపాయాలు చేయాలి. ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యాలు ప్ర‌జ‌ల‌కోసం ఏం చేయాలి? అన్న‌దానిపైనా చ‌ర్చ సాగుతోంది. అస‌లు ప్ర‌జ‌ల డిమాండ్లు ఎలా ఉన్నాయి? అంటే..

కెమిక‌ల్ కంపెనీల‌కు నియ‌మావ‌ళి ఇదీ..

*ప‌రిశ్ర‌మ ప్ర‌భావిత ప్రాంతంగా వెంట‌నే స‌ద‌రు ఫ్యాక్ట‌రీ వాళ్లు ప్ర‌క‌టించాలి. జిల్లా క‌లెక్ట‌ర్ నోటీస్ చేయాలి ఇది.
* స్మెల్లింగ్ (ర‌సాయ‌న వాస‌న‌లు) సాధ్య‌మైనంత కంట్రోల్ లో ఉంచాలి. ఇది వెంట‌నే జ‌ర‌గాలి..
వాస‌న‌ల వ‌ల్ల ప్ర‌జారోగ్యం పాడైతే కంపెనీ దే బాధ్య‌త‌. అందుకు వెంట‌నే ఆస్ప‌త్రి స‌దుపాయం వీళ్లే చేయాలి. ప్ర‌జ‌లంద‌రికీ గ్రూప్ హెల్త్ ఇన్స్యూరెన్సులు వాళ్లే చేయాలి..
* ఫ్యాక్ట‌రీ పెట్టాక‌ వీళ్ల‌ను ఎవ‌రూ ఎప్ప‌టికీ ఖాళీ చేయించ‌లేరు కాబ‌ట్టి.. ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌తి రైతుకు మినిమైజ్డ్ పంట న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి (కెమిక‌ల్ డ్యామేజ్ కింద‌).
* ప్ర‌మాదాలు సంభ‌వించ‌క ముందే.. గ్రామస్తుల‌కు ఆల్ట‌ర్నేట్ గృహ‌స‌దుపాయాలు క‌ల్పించాలి.
అవి ఫ్యాక్ట‌రీ ప్ర‌భావిత ప్రాంతం కాని చోట నిర్మించాలి.
*ప్ర‌మాద స‌మ‌యంలో అలార్మ్ వ్య‌వ‌స్థ ఆటోమెటిగ్గా ప‌ని చేయాలి.. అది ప‌రిస‌ర విలేజ్ ల‌కు అనుసంధాన‌మై ఉండాలి.
* విలేజ్ లో పంట‌ల‌న్నీ పండే వ‌ర‌కూ బోర్ వాట‌ర్ క‌రెంట్ బిల్స్ స‌ద‌రు ఫ్యాక్ట‌రీ అధిప‌తులే చెల్లించాలి.
* ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల భూముల ధ‌ర‌లు పెరిగాయి. పెరిగిన ధ‌ర‌లు చెల్లించి ప్ర‌జ‌ల భూమిల్ని కెమిక‌ల్ హ‌బ్ కోసం ప్ర‌భుత్వాలే కొనాలి. ఇండ్లు ఖాళీ చేయిస్తే న‌ష్ట‌ప‌రిహారం మార్కెట్ వ్యాల్యూ చెల్లించాలి.
* వీట‌న్నిటికీ ప్ర‌భుత్వాల్ని ప్ర‌భావితం చేయాల్సింది స్థానిక‌ నాయ‌కులు.. ప్ర‌జ‌లు సంయుక్తంగా..
* స‌మ‌స్య‌ను కేవ‌లం నాయ‌కుల‌పైకి తోసి వ‌దిలేయ‌డం క‌రెక్ట్ కాదు.. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా చేయాల్సిన ప‌ని.
* కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు క‌ట్టేప్పుడు ఆ ప‌రిస‌రాల్లో ప్ర‌జ‌లు నివ‌శించ‌కూడ‌ద‌ని రూల్ ఉంది.. దానిని ప‌రిశీలించి ఆ ప్ర‌కారం ప్ర‌భుత్వాలు ఆల్ట‌ర్నేట్ ఏర్పాట్లు చేయాలి.. అలా కాకుండా ప్ర‌జ‌ల ప్రాణాల్ని ప‌ణంగా పెట్ట‌కూడ‌దు.
*గ్రామ‌స్తుల‌కు మంచి రోడ్లు వేయాలి.. ప్ర‌భుత్వ బడ్జెట్ల‌కు స‌హ‌క‌రించాలి.
*కెమిక‌ల్ గ్యాస్ లీక్ వ‌ల్ల దీర్ఘ కాలిక ఆరోగ్య స‌మస్య‌లు ఎలా ఉంటాయి? అన్న‌దానిపై ముందే హెల్త్ డిపార్ట్ మెంట్ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు చేయాలి.
* ఊరిలో నాయ‌కుల‌కు బిరియానీ.. బ్రిటానియా బిస్కెట్లు.. స‌ప్తాహానికి చందాలు కంపెనీల వాళ్లు ఇవ్వ‌న‌క్క‌ర్లేదు.. నాయ‌కుల్ని- మీడియాల్ని మ్యానేజ్ చేయాల్సిన అవ‌స‌రం అస‌లే లేదు..
పై డిమాండ్లు నెర‌వేరిస్తే చాలు!