Bezawada Dirty Politics : బెజవాడ శవ రాజకీయం: ఏ పార్టీకి ఎంత లాభమొచ్చింది.?

Bezawada Dirty Politics : మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, వెబ్ మీడియా.. అంతా హోరెత్తిపోయింది బెజవాడలో ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. వైసీపీ, ఈ వ్యవహారాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకుంది. తమ పార్టీ నేత ఇంత ఘాతుకానికి పాల్పడటంపై నివ్వెరపోయిన టీడీపీ, సదరు వినోద్ జైన్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.. అక్కడితో ఆగకుండా, అధికార వైసీపీ మీద ఎదురుదాడికి దిగింది.

సోషల మీడియా వేదికగా తమ పార్టీ కార్యకర్తల ద్వారా అటు వైసీపీ, ఇటు టీడీపీ.. ఒకరి మీద ఒకరు రాజకీయంగా బురద చల్లుకున్నారు.. ఈ మొత్తం వ్యవహారంలో బాధిత బాలిక ‘మృతి ఓ రాజకీయ వస్తువుగా మారిపోవడమే శోచనీయం.

ఇంతకీ, కామాంధుడు వినోద్ జైన్ ఉరికంబమెక్కుతాడా.? యావజ్జీవ కఠిన కారాగార శిక్షకు గురవుతాడా.? అది కోర్టు తేల్చాల్సిన అంశం. ఒకవేల బెయిల్ మీద విడుదలైతే, ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతాడు.? ఏ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాడు.? అన్న అంశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత, చాలామంది నేతలు చాలా రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలా అనుమానాలు వ్యక్తం చేసిన ఓ రాజకీయ ప్రముఖుడు, ఇప్పుడు వైసీపీలో కీలక నేత.. పైగా, సీనియర్ మంత్రి కూడా.

సదరు మంత్రిగారిని ఒకప్పుడు ఇదే వైసీపీ, ‘లిక్కర్ డాన్’ అని అభివర్ణించింది. ఆయనిప్పుడు ‘సుద్దపూస’, ‘కడిగిన ముత్యం’ అన్నమాట. రాజకీయాలంటే ఇలానే వుంటాయి. వినోద్ జైన్, టీడీపీ నేత మాత్రమే కాదు.. అంతకు ముందు బీజేపీ నాయకుడు.. ఇప్పటి మంత్రి ఒకరితో ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు నడిపాడు, వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.

ఇక్కడ మేటర్ క్లియర్.. జరుగుతున్నదంతా రాజకీయమే.. కాదు కాదు శవ రాజకీయం. ఈ శవరాజకీయంలో ఎవరి లాభం ఎంత.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న.