బాలయ్యది సంస్కారం.. మరి మోహన్‌బాబుది ఏంటి.?

2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు సినీ నటుడు మోహన్ బాబు. ఆ ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు వైసీపీలో చేరడం, ఈ క్రమంలో టీడీపీ నేతలకీ, మోహన్‌బాబుకీ మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిన సంగతే.

వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో బాలయ్య అల్లుడు నారా లోకేష్‌కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినట్లు స్వయంగా మోహన్ బాబు వెల్లడించారు. అయినాగానీ, బాలకృష్ణ అవేవీ మనసులో పెట్టుకోలేదట. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకి బాలయ్య ఓటేశాడంటూ మోహన్ బాబు చెప్పుకున్నారు. సీక్రెట్ బ్యాలెట్ కదా.? ఎవరు ఎవరికి ఓటేశారో మోహన్ బాబు ఎలా చెప్పగలరు.?

ఆ విషయం పక్కన పెడితే, స్వర్గీయ నందమూరి తారకరామారావుని ‘అన్నయ్యా..’ అని అంటుంటారు మోహన్ బాబు. మరి, ఆ అన్నగారి మనవడైన నారా లోకేష్ ఓటమి కోసం పనిచేసినట్లు మోహన్ బాబు చెప్పడాన్ని ఏమనాలి.? దీన్ని ఏ కోణంలో ‘సంస్కారం’ అనగలం.? అని టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

‘మా’ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం, ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు, మర్యాదపూర్వకంగా బాలకృష్ణను కలిశారు. మంచు విష్ణు వెనుక ఆయన తండ్రి మోహన్ బాబు కూడా వున్నారు. అదీ అసలు సంగతి. సినిమా వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌తో విభేదించిన ప్రకాష్ రాజ్, ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్ర పోషించలేదా.?

చిరంజీవి – బాలకృష్ణ.. రాజకీయాల సంగతి పక్కన పెడితే, ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ విషయాన్ని చిరంజీవి, బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు. ‘మా’ ఎన్నికల వ్యవహారం వేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాంతీయత, కులం, మతం.. ఇలా చాలా అంశాల ప్రాతిపదికన ‘మా’ ఎన్నికలు ఈసారి జరిగాయి.

గెలుపోటముల సంగతి పక్కన పెడితే, అందరూ కలిసి కట్టుగా ‘మా’ అభివృద్ధి కోసం పని చేయాల్సి వుంది. కానీ, ఆ వాతావరణం వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘మా’కి సంబంధించి అందర్నీ కలుపుకుపోవాల్సిన బాధ్యత ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మీద వుంది. ఆ దిశగా ఆయనెంత విజయం సాధిస్తాడు.? అన్నది ముందు ముందు తేలనుంది.

ఈలోగా, అనవసర రాజకీయల్ని సినిమా రంగంలోకి జొప్పించి, ఆధిపత్య పోరు తెరపైకి తెచ్చి, కుంపట్లు సృష్టించాలని పరిశ్రమలో ఎవరు ప్రయత్నించినా.. అది అంతిమంగా పరిశ్రమకే పెను నష్టాన్ని కలిగిస్తుంది.