Jagan’s New Cabinet : మంత్రి వర్గ విస్తరణకు ఏప్రిల్ 11 ముహూర్తం: అంతా కొత్తవారేనా.?

Jagan’s New Cabinet :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి క్యాబినెట్‌ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు అందరూ కొత్తవారినే తీసుకోబోతున్నారట. ఏప్రిల్ 11న కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లిస్టు దాదాపు ఫైనల్ అయిపోయిందట.

మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయన్నదానిపై ఆయా నేతలకు ముందస్తుగానే సమాచారం అందిందని అంటున్నారు. అయితే, ఎక్కడా ఎవరూ తమకు మంత్రి పదవి దక్కిన విషయాన్ని బయటపెట్టొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట.

మంత్రి వర్గంలో రోజాకి చోటు ఖరారైందని అంటున్నారు. విడదల రజనీ పేరు కూడా లిస్టులో వుంటుందట. ఈ ఇద్దరికీ మంత్రి వర్గంలో కీలక శాఖలు దక్కబోతున్నాయట. ఐదుగురు మహిళా మంత్రులు వుంటారనీ, అదనంగా ఇంకో మహిళా మంత్రికి ఛాన్స్ వుందనీ సమాచారం.

ఇదిలా వుంటే, సామాజిక వర్గాల సమతౌల్యం పక్కాగా పాటించారని కూడా చెబుతున్నారు. పాత మంత్రుల్లో ఒకరిద్దరికి మాత్రమే కొనసాగింపు వుండబోతోందట. దాదాపుగా మంత్రులంతా తాము పదవులు కోల్పోతున్నామన్న విషయమై ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయారు.

‘మంత్రి పదవి పోయినా, పార్టీ పదవులు దక్కుతాయి. పార్టీ పరంగా అందరికీ అమితమైన ప్రాధాన్యతనిస్తాం. మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే, మళ్ళీ మంత్రి పదవులొస్తాయ్..’ అంటూ ఇటీవల శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, హోంమంత్రి పదవి మళ్ళీ మహిళకే దక్కుతుందా.? లేదా.? అన్నదానిపై కాస్త స్పష్టత రావాల్సి వుంది.