ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని వచ్చిన ఆరోపణలు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. విపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం న్యాయవాదులు, జడ్జిలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్ల ట్యాపింగ్ చేస్తోందని, ఈ విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అసలే కోర్టులకు, ప్రభుత్వానికి మధ్యన ఆందోళనకర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వైసీపీ నేతలకు హైకోర్టు తీర్పులు అస్సలు రుచించడం లేదు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ అంశమై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి.
దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షులు, సీవీసీ, సీబీఐ, విశాఖ సీబీఐ ఎస్పీలకు నోటీసులు వెళ్లాయి. వీరంతా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరుకావాలని, నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖకు చెందిన నక్కా నిమ్మిగ్రేస్ వేసిన పిల్ మీద కోర్టు విచారణ జరిపి ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషన్లో ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇది న్యాయ వ్యవస్థకు జరిగిన అవమానమని, ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కోరడం, మొదటగా ఈ ఫోన్ ట్యాపింగ్ కథనాలను ప్రచురించిన పత్రిక విశ్వసనీయ సమాచారం ఉందని అనడం మూలాన కేసు జఠిలంగా మారింది. ప్రభుత్వం కూడా ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తున్నదే తప్ప ఎక్కడా తమ తప్పు లేదని ఆధారాలు చూపలేకపోతోంది. అందుకే విపక్ష నేతల ఆరోపణలకు బలం చేకూరింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమై, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే పెద్ద పెద్ద తలలు దొరకడం ఖయంగా కనిపిస్తోంది.