AP Assembly : తెలుగుదేశం పార్టీని అసెంబ్లీకి ఆహ్వానిస్తోంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు వైసీపీ కీలక నేత, విప్ శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అంశాలపైనా అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. అన్ని అంశాలూ అంటే, గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణిని అసెంబ్లీలో వైసీపీ శాసన సభ్యుదు దూషించడంపైనా.? అన్న సెటైర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. అంతేనా, ‘అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడం తప్ప.. ఏ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులైనా చేసేదేముంది.?’ అంటూ నెటిజనం మండిపడుతున్నారు.
ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన పైత్యం కాదిది. చంద్రబాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడిన ‘వినకూడని’ మాటలు.. అహో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
నిజమే, అసెంబ్లీలో విపక్షాలు లేకుండా.. కేవలం అధికార పక్షమే వుంటే ఎంత బావుంటుంది.? అనుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే, అసెంబ్లీకి విపక్షాలు రాకపోయినా, స్వపక్షంలోనే విపక్షం అనుకుని.. ఏదో ఒక అంశాన్ని పట్టుకుని, విపక్షాలపై విరుచుకుపడిపోవడం అధికారంలో వున్నవారికి బాగా అలవాటైపోయింది.
రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై చట్ట సభల్లో చర్చ జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కనీసం ఒక్కశాతమైనా అనుకుంటున్నారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ‘నువ్వు నేర్పిన విద్యయే..’ అన్న చందాన చంద్రబాబుకి వైసీపీ షాకులు ఇస్తూ వస్తోంది. కానీ, ఇదా పద్ధతి.? అన్నదే వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి.
చంద్రబాబు హయాంలో అప్పట్లో పార్టీ ఫిరాయించిన వైసీపీ నేతలతో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తిట్టించారు. అదే పని ఇప్పుడు వైసీపీ చేస్తోంది గనుక.. ఆ కోణంలో చూస్తే వైసీపీ చేసేది తప్పు కాదనిపించొచ్చు. కానీ, ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కానే కాదు.