తెలుగు రాష్ర్టాలు జల వివాదంతో నలిగిపోతున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్ట్ దిగువన పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రెండు రాష్ర్టాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టాలు వాటర్ బోర్డు వద్దకు పంచాయతీకి వెళ్లడం…అక్కడ నుంచి అపెక్స్ కమిటీ సిఫార్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉంది. అక్కడ వరకూ వెళ్తే తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ ఆరోపించడం తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు ద్వారా తెల్చుకుందమాని హెచ్చరించడం జరిగింది. అనంతరం ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రలు కోర్టులు, కేంద్రానికి కంటే ముందుగా ఇరువురు భేటీ అయి ఓ నిర్ణయం తీసుకుందామనుకున్నారు.
అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు అదే పనిలో బిజీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో తాజాగా మరో జల వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల మళ్లింపు ప్రాజెక్ట్ ను అనుమతులు లేకుండా నిర్మించే సన్నాహాలు చేస్తుందని, గోదావరి -కృష్ణా-పెన్నా నదుల అనుంసంధానం ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ నీటి పారుదల శాఖ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్ సీ మురళీధర్ జీఆర్ ఎంబీ మెంబర్ సెక్రటరీ గోదావరి జలాలు, మిగులు జలాల్లో వాటా తేలే వరకూఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో కూడా దీన్ని ప్రస్తావించిందని, గోదావరి జలాలను అదనంగా 300 టీఎంసీలను ఎలాంటి కేటాయింపులు లేకుండా కృష్ణా, సాగర్ కుడికాల్వ, రాయలసీమకు తరలించుకోవడం సరికాదన్నారు. 68 వేల కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్ట్ చేపడుతుందని, పోలవరం కుడికాల్వ ద్వారా ఇప్పటికే తరలిస్తోన్న 80 టీఎంసీలకు తోడు అదనంగా 300 టీఎంసీలు తరలించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నీటి కేటాయింపులు పూర్తయ్యే వరకూ ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్లడానికి వీలు లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అడ్డు పడింది. మరి దీనిపై జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ఉన్న జల జగడానికి తోడు తాజాగా ఈ వివాదం రెండు రాష్ర్టాల మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.