మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ – బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య లేఖల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు రిలీజ్ చేసిన సుఖేష్… తాజాగా ఐదుపేజీల లేఖ విడుదల చేశాడు. ఈ లేఖలో కవితపై సంచలన ఆరోపణలు చేయడంతోపాటు… కొన్ని రోజుల క్రితం.. “అసలు సుకేష్ అంటే ఎవరు..?” కవిత ప్రశ్నించిన విషయంపై కూడా స్పందించారు.
అవును… మనీ లాండరింగ్ కేసులో మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. కేజ్రీవాల్ తో పాటు కవితను కూడా ఈ లేఖలో బలంగా టార్గెట్ చేశారు. “ఆర్థిక నేరగాడు” అంటూ తనను సంబోధించిన కవిత… తనతో ఎలాంటి సంబంధాలూ లేవని ఇటీవల మీడియాకు చెప్పినట్లు తెలిసిందని.. కానీ తన ఫోన్ లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్ 91-6209999999, 91-8985699999 ఆమెదో కాదో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వాట్సాప్ చాటింగ్ లో కవితను “అక్కా” అని తాను సంబోధించినందుకు.. తెలుగు ఎలా వచ్చు అంటూ పాయింట్ లేవనెత్తారని.. కానీ, తన మాతృభాష తెలుగు, తమిళం అని సుఖేశ్ క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో… కవిత గురించి మరింత స్పందించిన సుఖేష్… “ఎల్లప్పుడూ కవితను నా అక్కగా గౌరవిస్తాను. కవితను కవితక్క అని సంబోధించాను, ఆమె నా పెద్ద అక్కగా భావించాను. కానీ, దేశం, ప్రజాప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడుతున్నాను” అంటూ ఆ లేఖలో రాసుకొచ్చాడు!
అనంతరం తనను దొంగ అనడంపై స్పందించిన సుకేష్… “నన్ను దొంగ, ఆర్థిక నేరగాడు అంటూ విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంభాషణలపై సీఐడీ, ఈడీతో విచారణ జరిపించాలి. కోర్టు ధుృవీకరణ ఎవిడెన్స్ చట్టం 65-బి కింద స్క్రీన్ షాట్స్‌ను విడుదల చేశాను. కవితకు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైమ్ లో కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్స్ ను కూడా విడుదల చేస్తాను. కేజ్రీవాల్ తర్వాత నీవంతే కవితక్క. తీహార్ క్లబ్ కు కవితక్కను కేజ్రీవాల్ ను స్వాగతిస్తున్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుఖేష్!
దీంతో ఈ లేఖ మరోసారి దేశరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు లేఖలు, రెండు చాట్ లు రిలీజ్ చేసిన సుఖేష్… తన వద్దా ఇంకా 700కు పైగా చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయని చెప్పడంతో… మరింత సంచలన విషయాలు రాబోతున్నాయని అంటున్నారు. కాగా.. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.