ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. అక్కడి నుంచే పాలన జరుగుతుంది గనుక, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుంది. అది పులివెందుల కావొచ్చు, విజయవాడ కావొచ్చు, విశాఖ కావొచ్చు.. కర్నూలు కావొచ్చు.. అంటున్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడున్నరేళ్ళు దాటుతున్నా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది.. ఆ తర్వాత అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసింది వైఎస్ జగన్ సర్కార్. విశాఖ, కర్నూలు నగరాల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడీషియల్ క్యాపిటల్గా వైఎస్ జగన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇంతవరకు వాటికి అధికారికంగా ఆ హోదా దక్కలేదు.
పోనీ, అమరావతిని అయినా శాసన రాజధాని కింద అభివృద్ధి చేస్తున్నారా.? అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి నివాసం వుంటోన్న అమరావతిలోని తాడేపల్లిని రాజధాని అనుకోవాలా.? లేదంటే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులను రాజధాని అనుకోవాలా.? ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇది. హుద్‌హుద్ తుపాను సమయంలో కొన్ని రోజులపాటు విశాఖలోనే వుండి చంద్రబాబు రాష్ట్ర పరిపాలనా కార్యక్రమాలు చూసుకున్నారు. కాబట్టి, విశాఖను రాజధాని అనుకోవాలేమో. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చుగానీ, రాజధాని లేని రాష్ట్రం.. అన్న భావన రాష్ట్ర ప్రజలకు ఒకింత జుగుప్సాకరంగానే అనిపిస్తుంటుంది. అది నిజంగానే రాష్ట్ర ప్రజలకు అవమానకరమైన అంశం. కోర్టు కేసుల సాకు చూపి, ఎక్కువ కాలం రాష్ట్రానికి రాజధాని లేదన్న భావన కలిగించడం అధికార వైసీపీకి అస్సలు సబబు కాదు. ఏదో ఒకటి.. ఇదీ మన రాజధాని.. అందులో ఇదీ జరుగుతున్న అభివృద్ధి అని పాలకులు చెప్పలేకపోవడమంటే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?