జయప్రద కొత్త వేషం రామ్ పూర్ ఓటర్లకు నచ్చుతుందా?

హీరోయిన్ జయప్రద మూడో సారి లోక్ సభ లో ప్రవేశించేందుకు ఈ సారి చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయత్నం కూడా ఉత్తరప్రదేశ్ నుంచే చేస్తున్నారు. ఈ సారి బిజెపిలో అభ్యర్థిగా  ఉత్తరప్రదేశ్ రామ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఇది ఆమెకు నాలుగో ఎన్నిక. మొదటి సార్లు నెగ్గారు. మూడో సారి వోడిపోయారు. ఇపుడు మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆమె విజయానికి రాజకీయ గురు అమర్ సింగ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 ఈ సారి రామ్ పూర్ లో  ఒకప్పటి మిత్రుడు, అతర్వాత బద్ధశత్రువుగా మారిన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఆజాంఖాన్ ఆమె ప్రత్యర్థి.ఆజాంఖాన్ సొంతవూరు రామ్ పూరే.

జయప్రద, ప్రత్యర్థి అజామ్ ఖాన్

గతంలో ఇక్కడి నుంచి జయప్రద రెండుసార్లు లోక్ సభకు గెలిచారు. సమాజ్ వాది పార్టీ పెద్దాయన ములాయం సింగ్ కు  ఒకపుడు సలహాదారుగా ఉన్న అమర్ సింగ్ ద్వారా ఆమె ఈ పార్టీలో చేరారు.

2004 మొదటి సారి ఆమె ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని నూర్ బానో (రామ్ పూర్ రాణి)ను ఓడించారు. నిజానికి ఆమెను రామ్ పూర్ నియోజకవర్గానికి తీసుకు వెళ్లింది, బాగా ప్రచారం చేసి గెలిపించిందికూడా ఆజాంఖానే.నూర్ బాను ను దెబ్బతీసేందుకే ఆయన జయప్రదను రామ్ పూర్ కు రప్పించుకుని నిలబెట్టి, ప్రచారం చేసి గెలిపించారు. అపుడాయన రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉండేవారు.

ఈ మధ్య వారిద్దరి సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఒకరినొకరు విమర్శించుకుంటూ బజారెక్కారు. అజాంఖాన్ అట్లాంటోడు ఇట్లాంటోడుకాదు ఏకంగా  ‘అల్లావుద్దీన్ ఖిల్జీ అని జయప్రద రెచ్చిపోతే, ఆమె ఒక ‘నాచ్నే వాలీ’ అంటే డ్యాన్సర్ అని ఆజామ్ ఖాన్  అన్నారు.

జయప్రద ను అంతమాట అంటావా అని ఆజామ్ ఖాన్ మీద అపుడు బాగా పీక్ లో ఉన్న అమర్ సింగ్ ఆగ్రహించారు.

అమర్ సింగ్

2009 ఎన్నికల్లో ఆమెకు సీటురాకుండా చేయాలని ఆజాంఖాన్ ప్రయత్నించారు. అయితే, ఆమె వెనక ఉన్న శక్తి అమర్ సింగ్, అమర్ సింగ్ వెనక ఉండేది ములాయాం సింగ్ యాదవ్ కాబట్టి  రెండో సారి రామ్ పూర్  నుంచి నిలబడే అవకాశం దొరిగింది. అపుడు అజాంఖాన్ ప్రచారం చేయకపోయకపోగా, పరోక్షంగా నూర్ బానో కు సహాయం కూడా చేశారని చెబుతారు. అయినా సరే రెండో సారి కూడా జయప్రద అక్కడి నుంచి గెలిచారు.

అమర్ సింగ్ జోరుగా ఉన్నాడు కాబట్టి అజాంఖాన్ ను పార్టీనుంచి కూడా పంపించాడు. జయప్రదను నాచ్నేవాలీ అన్నందుకు పార్టీ నుంచి బహిష్కరింపచేసి ఆయన ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడని చెబుతారు.

రామ్ పూర్ ఎన్నిక గురించి మాట్లాడే టపుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రామ్ పూర్ లో గెలుపొందిన రెండు ఎన్నికల్లో ఆమెకు సమాజ్ వాది పార్టీ ముస్లిం ఇమేజ్ బాగా పనిచేసింది. ఇపుడామె ముస్లిం వ్యతిరేక పార్టీ బిజెపి లో ఉన్నారు. దానికి తోడు ఉత్తర ప్రదేశ్ లో ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా రామ్ పూరే. ఈ ఎన్నిక ఆమె  రామ్ పూర్ ప్రజల్లో జయప్రద సంపాదించుకున్న ప్రేమాభిమానాలకు పరీక్ష

రాజకీయాల్లో అన్నిరోజులు ఒక లాగే ఉండవు. పరిస్థితులు తిరగబడుతుంటాయి. 2010లో అమర్ సింగ్ ను, జయప్రదను  సమాజ్ వాది పార్టీ నుంచి తరిమేశారు. అపుడు జయప్రద అమర్ సింగ్ తోపాటు అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. ఆమె  2014లో బిజ్నోర్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అక్కడ డిపాజిట్ కూడా దక్కలేదు. నాలుగో స్థానంలో కేవలం 24 వేల వోట్లొచ్చాయి.

ఇక ఆమె రాజకీయజీవితం ముగింపుకు వచ్చినట్లే అనుకున్నారు. వైసిపి,టిడిపి, కాంగ్రెస్… ఇలా అన్ని పార్టీలలో ఆమె చేరబోతున్నారని వార్తలొచ్చాయి. ఇవేవీ నిజం కాలేదు.

ఇలాంటపు ఆమె ‘గురు’ అమర్ సింగ్ బిజెపి వైపు మొగ్గారు. ఉత్తర ప్రదేశ్ లోని ఆజాంగడ్ లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని ఆర్ ఎస్ ఎస్ కు విరాళంగా ఇచ్చి తన విశాల హదయాన్ని, దేశభక్తిని చాటుకున్నారు.

జయప్రదకు కూడా కాషాయ కండువా కప్పించారు. ఆమెకు రామ్ పూర్ సీటును కూడా ఇప్పించారు.
ఇపుడేమవుతందో చూడాలి…