శేష్ రీమేక్ భేష్ – ‘ఎవరు’ మూవీ రివ్యూ!
‘క్షణం’, ‘గూఢచారి’ వంటి థ్రిల్లర్స్ తో పేరు తెచ్చుకున్న హీరో అడివి శేష్, మరో థ్రిల్లర్ ‘ఎవరు’ తో ఆసక్తి రేపుతూ వచ్చాడు. ట్రైలర్స్ వైరల్ అయ్యాయి. బుకింగ్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ముందుండే మాస్ బాబుల బెంచి క్లాసులు కూడా సందులేకుండా నిండిపోయాయి. రోమాంటిక్ కామెడీల దరిద్రం వదిలి, చక్కగా వారానికో సస్పెన్స్ థ్రిల్లర్ రావడంతో థియేటర్లు కళకళ లాడుతున్నాయి. మధ్య, చిన్న తరహా సినిమాల మార్కెట్ ఈ తరహా సినిమాలతో పుంజుకుంటోంది. కిక్కు ఈ తరహా సినిమాల్లో వుంది. ‘ఎవరు’ వీటి పక్కన చేరింది. ఇదెలా ఈ వారపు థ్రిల్లర్ కానుకగా అలరించిందో ఓసారి చూద్దాం…
కథ
సమీరా ఒక సంపన్నుడి భార్య. ఆమె అశోక్(నవీన్ చంద్ర) అనే డీఎస్పీ హత్యకేసులో బెయిలుపై వుంటుంది. తనని మానభంగం చేయబోయినందుకు చంపానని అంటుంది. అవతలి వైపు ఈ కేసుని వాదించడానికి కొమ్ములు తిరిగిన లాయర్ వస్తున్నాడని, అతణ్ణి ఢీకొనేందుకు సాక్ష్యాధారాల్ని తారుమారు చేయాలనీ ఆమెకి సమాచారమందుతుంది. ఈ పని విక్రం వాసుదేవ్ (అడివి శేష్) అనే ఎస్సై చేస్తాడని తెలియడంతో అతడికి పాతిక లక్షలు లంచం ఇస్తుంది. విక్రం వాసుదేవ్ ఆమెని హోటల్ గదిలో కలుసుకుని అసలేం జరిగిందో చెప్పమంటాడు. ఆమె తనకి అశోక్ తో వున్న సంబంధం గురించి చెప్పుకొస్తుంది. ఇంతలో తన తండ్రి కన్పించడం లేదని పోలీస్ స్టేషన్ కి ఒక కొడుకు వచ్చి కంప్లెయింట్ చేస్తాడు. విక్రం ఈ కేసు కూడా తీసుకుంటాడు. ఈ రెండు కేసులకున్న సంబంధ మేమిటి? సమీరా చెప్తున్నది నిజమేనా? ఆమె ఎన్ని హత్యలు చేసింది – ఒకటా? రెండా? ఆత్మరక్షణ కోసం చేసిందా, ఉద్దేశపూర్వకంగానా? ఇవి తెలితే గానీ ఆమెని కేసులోంచి బయటపడేయగలడు విక్రం వాసుదేవ్….
ఎలావుంది కథ
ఇది ‘ఇన్విజిబుల్ గెస్ట్’ మూవీకి రిమేక్ అని తెలిసిందే. గత మార్చిలోనే ‘బద్లా’ గా అమితాబ్ బచ్చన్, తాప్సీలతో ‘కహానీ’ ఫేమ్ దర్శకుడు సుజోయ్ ఘోష్ చేసిన హిందీ రీమేక్ విడుదలై హిట్టయింది. ఒరిజినల్ కీ, హిందీకీ, తెలుగు రీమేక్ పాత్రలతోనే కాదు, కథతో కూడా తేడాగా వుంది. తెలుగుకి ఇలా వుంటే సరిపోతుందేమో. ఒరిజినల్లో గర్ల్ ఫ్రెండ్ హత్య కేసులో నిందితుడిగా మేల్ ఆర్టిస్టు వుంటే, అతణ్ణి కాపాడేందుకు వచ్చే లాయర్ గా లేడీ ఆర్టిస్టు వుంటుంది. హిందీలో నిందితురాలిగా ఫిమేల్ ఆర్టిస్టు తాప్సీ వుంటే, లాయర్ గా మేల్ ఆర్టిస్టు అమితాబ్ వుంటాడు. తెలుగులో నిందితురాలిగా హిందీలోలాగే ఫిమేల్ ఆర్టిస్టు రేజీనా వుంటే, లాయర్ బదులు ఎస్సైగా మేల్ ఆర్టిస్టు శేష్ వున్నాడు.
తెలుగులో లాయర్ పాత్ర నప్పదని, పోలీస్ పాత్రని అందరూ గుర్తిస్తారని, ఎస్సైగా మార్చినట్టున్నారు గానీ, దీంతో కథనే దెబ్బతీసే మౌలిక సమస్య ఒకటుంది. నిందితురాలు ఒకటికాదు రెండు హత్యలు చేసినందనుకుంటే, ఆమె ఏంతో తెలివైనది. అలాటిది తను డీఎస్పీ అంతటి వాణ్ణి చంపినప్పుడు, ఇంతటి హై ప్రొఫైల్ కేసుని నీరు గారుస్తానంటూ ఒక ఎస్సై వస్తే, ఎలా నమ్మి అతడి ట్రాప్ లో పడుతుందన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న వేసుకుంటే ఈ కథే వుండే అవకాశం లేదు. ఒరిజినల్లో, హిందీలో లాయర్ వచ్చిందంటే / వచ్చాడంటే నమ్మే అవకాశం నూరు శాతం వుంది.
తెలుగులో ఆమె చేత రెండు హత్యలు చేయించి పాత్రని clumsy చేశారు గానీ, ఒరిజినల్లో, హిందీలో చేసేది బుద్ధిపూర్వకంగా ఒక హత్యే. రెండోది యాక్సిడెంట్. ఎదుటి కారుకి తన కారు గుద్దుకోవడంతో ఆ యువకుడు చనిపోయాడని భయపడి, ఆ కారుతో సహా అతణ్ణి చెరువులోకి తోసేస్తుంది. తర్వాత అతను చనిపోయాక నీట మునగ లేదనీ, నీట మునిగాకే చనిపోయాడనీ పోస్ట్ మార్టమ్ లో బయట పడ్డంతో హత్య కేసయిపోతుంది. ఇలా నిజజీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలని దృష్టిలో పెట్టుకుని. మైక్రో లెవెల్లో కథ చేశారు. తెలుగులో కృత్రిమత్వంతో మాక్రో లెవెల్లో కథ చేశారు. నిజ జీవితంలో మైక్రో లెవల్లోనే జరుగుతూంటాయి.
అసలీ మొత్తం కాన్సెప్ట్ ఒరిజినల్లో ప్రసరింపజేస్తున్న కర్మ సిద్ధాంతాన్ని హిందీలో అలాగే ఒడిసి పట్టుకుని డీప్ గా కనెక్ట్ చేశారు. తెలుగులో ఈ స్పిరిచ్యువల్ మీనింగ్ ని అర్ధం జేసుకోకుండా ఒక సాధారణ క్రైం థ్రిల్లర్ దృష్టితో రీమేక్ చేసేశారు. నిజానికి ఒరిజినల్ మూవీ, దీని హిందీ రీమేక్ నియో నోయర్ జానర్ కి చెందినవి. నియో నోయర్ జానర్ సినిమాలు నేరాలకి కర్మసిద్ధాంతాని అన్వయించి కథ నడుపుకుంటాయి. నేరస్థులు కర్మ ఫలాన్ని అనుభవించేలా చేస్తాయి. చట్టానిదే పై చేయిగా వుంటాయి. కర్మ ఫలం, విధి, నైతిక విలువలూ అనే ఫిలాసఫీల్ని బేస్ చేసుకుని చట్ట కథలు చెప్తాయివి.
ఒరిజినల్లో, హిందీలో నిందితుడు / నిందితురాలు వివాహేతర సంబంధంలో వుండి, ఇక ఈ సంబంధాన్ని వదులుకుని తమతమ జీవిత భాగస్వాములతో నిజాయితీగా వుండిపోవాలనుకుంటారు. అది కూడా జీవిత భాగస్వాముల్ని మోసం చేయడమే. తప్పు చేశామని వాళ్లకి చెప్పేస్తే అది నిజాయితీ అవుతుంది. చెప్పకుండా కలిసివుంటే వంచనే అవుతుంది. అందుకని ఈ వంచనని ఆపడానికి, విధి కారు ప్రమాదం రూపంలో ముంచుకొచ్చి వాళ్ళని ఇరుక్కునేలా చేస్తుంది. ఇలా ప్రమాదంతో జీవిత భాగస్వాములకి తెలిసిపోయేలా చేసి కర్మ ఫలాన్నిఅనుభవించమంటుంది విధి.
మరి విధి ఇందుకు అన్యాయంగా ఎదుటి కారు వాణ్ణి బలి తీసుకుందే అంటే, అన్యాయంగా బలి తీసుకోలేదు. అవతలి కారులో చనిపోయిన వాడు తక్కువేమీ కాదు, వాడు బ్యాంకులో అవినీతి చేస్తున్నాడు. వాడి కర్మ ఫలం వాడు అనుభవించాడు. కాన్సెప్ట్ లో ఈ మీనింగ్ ని కథకి సోల్ (ఆత్మ) అంటారు. ఇది నియో నోయర్ జానర్ ప్రత్యేకత.
ఈ చనిపోయిన వాడు కర్మ ఫలాన్ని అనుభవించే విధం కూడా లాజికల్ గా వుంటుంది. వాడు కారు స్పీడుగా డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మెసేజీలు పెడుతూ అదుపు తప్పి వీళ్ళ కారుని గుద్దేస్తాడు. ఆ టైంలో వాడికి మెసేజీలు పెట్టే బుద్ధి పుట్టడం యాక్సిడెంట్ కోసం విధి చేస్తున్న తయారీ. ఎక్కడెక్కడి కర్మ ఫలాన్ని అనుభవించాల్సిన వాళ్ళందర్నీ ఒక దగ్గర చేర్చి, ఢీ కొట్టించే విధి ఆటనే రోడ్డు ప్రమాదమంటారు. అర్ధం జేసుకుంటే జీవితం ఇంత సింపుల్ గా అర్ధమైపోతుంది. ఇలా ఒరిజినల్, హిందీ తదేక దృష్టితో ఆలోచనాత్మకంగా చూసేలా చేస్తాయి. నియోనోయర్ నేరాల కథలు విధి చుట్టూ నిర్మాణమై వుంటాయి. తెలుగులో ఈ మొత్తాన్నీ తీసేశారు.
ఇంకోటేమిటంటే, నిందితురాలి నైతిక ప్రవర్తనని తెలుగు సినిమాల సెంటిమెంట్స్ కి సరితూగాలన్నట్టు, పాత్రని మార్చారు. ఆమె డీఎస్పీతో సంబంధం పెట్టుకోవడానికి ఆమె భర్త హోమోసెక్సువాలిటీని కారణంగా చూపించి జస్టిఫై చేయబోయారు. దీంతో ఆమెకి గిల్టీ ఫీలింగ్ అవసరం లేదన్నట్టు తయారయ్యింది. ఒరిజినల్లో, హిందీలో గిల్టీ ఫీలింగ్ తోనే ఇక వివాహేతర సంబంధం మానుకోవాలన్న నైతికతకి వస్తారు, కానీ అందులో పూర్తీ నిజాయితీ లేక యాక్సిడెంట్ లో చిక్కుకుని అనుభవిస్తారు. ఈ డైనమిక్స్ తెలుగులో లేక, చివరి వరకూ ఆమె నైతికంగా ఫీలవక అదే తీరులో నెగెటివ్ గానే వుంటుంది.
ఒరిజినల్లో, హిందీలో ఆ వివాహేతర సంబంధాన్ని వాళ్ళ బెడ్ రూమ్ దృశ్యాలతో చూపలేదు. అసలు వాటి జోలికే పోలేదు. తెలుగులో మూడు సార్లు చాలా పచ్చి దృశ్యాలు చూపించారు. ఇది అడివి శేష్ సినిమా అని, నీటుగా వుంటుందనీ, గత రెండు సినిమాలు చూసిన అనుభవంతో విశేషంగా ఫ్యామిలీలు పిల్లలతో తరలి వచ్చారు. వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు.
ఎవరెలా చేశారు
ఎస్సై పాత్రని అడివి శేష్ నీటుగా పోషించాడు. రేజీనా తో ఒకే హోటల్ గదిలో వెర్బల్ గా సాగే ఇండోర్ డ్రామా కాబట్టి యాక్షన్ సీన్స్ కి అవకాశంలేదు. ఇది తెలుగు ప్రేక్షకులకి కొత్తయినా, కథ కూడా కొత్తది కావడంతో సేఫ్ అయిపోయాడు. రెజీనాని ప్రశ్నించే వాడిగా తన పాత్రకి చెప్పుకోవడానికి కథ లేదు, చివర్లో తప్ప. కథంతా వున్నది ప్రశ్నలకి జవాబిచ్చే రెజీనాకే. దీంతో అవుట్ డోర్ ఫ్లాష్ బ్యాక్స్ లో ఆమెకి వివిధ యాక్షన్ సీన్స్ జతపడ్డాయి. నెగెటివ్ పాత్రని తన టాలెంట్ తో నిలబెట్టుకుంది.
టెక్నికల్ గా ఈ మిస్టరీ మంచి నిర్మాణ విలువలతో వుంది. టెక్నికల్ విలువలకి కంటెంట్ కూడా తోడ్పడే సందర్భాలు తెలుగులో అరుదు. ఈ సస్పన్స్ థ్రిల్లర్ లో అడుగడుగునా ట్విస్టులుండడంతో, చివరి వరకూ అసలు విషయమేమిటో ఉత్కంఠ రేపే విధంగా వుండడంతో, చివర్లో మాస్టర్ స్ట్రోక్ ముగింపు థ్రిల్ చేయడంతో – ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతారు.
అడివి శేష్ సినిమా అంటే దర్శకుడు హైలైట్ అవని, రైటింగ్ లో మేకింగ్ లో అంతా అడివి శేష్ సినిమాలుగానే ముద్రేసుకుని వస్తున్నాయి కాబట్టి, దీనికి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ కూడా అంతగా గుర్తుకు రాడు. పైన చెప్పుకున్న లోటు పాట్లు తెలుగు ప్రమాణాలతో థ్రిల్లర్స్ కి అడ్డుకాక పోవచ్చు. కానీ ఇలాటి లోటు పాట్లు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుని, తెలుగు సినిమాలని ఇక మంచి సినిమాల నుంచి గొప్ప సినిమాల వైపుకు ప్రయాణం కట్టిస్తూ నెక్ట్స్ లెవెల్ కి తీసికెళ్ళడమే…
దర్శకత్వం : వెంకట్ రాంజీ
తారాగణం : అడివి శేష్, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళీశర్మ, పవిత్రా లోకేష్ తదితరులు
మాటలు : అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
బ్యానర్ : పివిపి సినిమా
నిర్మాతలు : పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ ఏన్
విడుదల : ఆగస్టు 15, 2019
3 / 5
―సికిందర్