రూటు మారని తెలంగాణా సినిమా -‘దొరసాని’ రివ్యూ!

 

రూటు మారని  తెలంగాణా సినిమా – ‘దొరసాని’ రివ్యూ!

తెలుగు యంగ్ తరంగ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కాంబినేషన్లో ‘దొరసాని’ మొదట్నుంచీ క్రేజ్ సృష్టిస్తోంది. షార్ట్ ఫిలిం దర్శకుడు కేవీఆర్ మాహేంద్ర ఈ తెలంగాణ సినిమా ప్రతిష్టాత్మకంగా తీశాడు. అయితే ఏ తెలంగాణా సినిమా తీశాడు… ఏ భావజాలంతో తీశాడన్నవి ప్రధానమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఏం సమాధానాలు వచ్చాయో ఈ కింద చూద్దాం…

కథ:
1980లలో తెలంగాణాలో భూస్వామ్యం శాసిస్తున్న కాలం. ఒక గడీకి దొర (వినయ్ వర్మ) కూతురు దేవకి (శివాత్మిక). ఈమెని చిన్న దొరసాని అని పిలుచుకుంటారు. ఒక దాసీ (శరణ్య) ఈమె సేవకురాలిగా వుంటుంది. ఒక బతుకమ్మ పండుగా నాడు దేవకిని చూడగానే మనసు పడతాడు రాజు (ఆనంద్ దేవరకొండ). ఇతను సున్నాలేసే కుటుంబానికి చెందిన వాడు. వేరే వూళ్ళో అమ్మమ్మ దగ్గర వుంటూ చదువుకుంటూంటాడు. దేవకికి రహస్యంగా కాల్స్ చేయడం, ఉత్తరాలు రాయడం చేస్తాడు. దీంతో అతడిమీద దేవకికీ ప్రేమ పుడుతుంది. ఆమె కిటికీ తెరిస్తే కింద నిలబడి చూస్తూంటాడెప్పుడూ. ఒక రాత్రి ఆమె అతడితో బయట సన్నిహితంగా గడిపి వస్తుంది. ఇంకో రాత్రి అతనే ఆమె గదికి రావడాన్నీ, అప్పుడు వాళ్ళ చుంబన దృశ్యాన్నీ దొర చూసేస్తాడు. ఇక కూల్ గా ప్లానింగ్ చేయడం మొదలెడతాడు. కూతుర్ని హైదరాబాద్ లో కొడుకు దగ్గరికి పంపించేసి, నక్సలైట్ కింద రాజుని అరెస్ట్ చేయిస్తాడు.

ఇక్కడ్నించీ వేడి రాజుకున్న పరిస్థితులు ఏఏ మలుపులకి దారి తీశాయనేదే మిగతా కథ. ఇంకో వైపు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే శంకరన్న(కిషోర్) అనే నక్సలైట్ వుంటాడు.

ఎలావుంది కథ:
వ్యవస్థకి ఎదురీదే యుగాలుగా వున్న ప్రేమ కథే. ప్రేమతో పేద – ధనిక, కింది కులం – పై కులాల కుమ్ములాటే ఈ పీరియడ్ కథ. దీన్ని తెలంగాణా ఆర్ట్ సినిమాలాగా ఒకప్పటి ఆర్ట్ సినిమాల ధోరణిలో తీశారు. దీంతో కథతోబాటు మేకింగ్ పాతగా అన్పిస్తాయి. దేశంలో భూస్వామ్య వ్యవస్థతో బాటు ఆర్ట్ సినిమాలూ 1980 లలోనే అంతరించి పోయాయి. దీంతో శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీల వంటి ఆర్ట్ సినిమా వైతాళికులు నిరుద్యోగులై పోయారు. 2000 ప్రారంభంలో శ్యాం బెనెగళ్ ఆర్ట్ సినిమాల్ని నేటి యువతరానికి నచ్చే ధోరణిలో బాలీవుడ్ స్టార్స్ తో క్రాసోవర్ సినిమాలుగా తీయడం మొదలెట్టారు. అంటే ఆర్ట్ సినిమాల్ని కమర్షియలైజ్ చేసి, కమర్షియలార్ట్ అనే క్రాసోవర్ జానర్ సినిమాలకి తెర తీసి మళ్ళీ విజయాలు సాధించడం మొదలెట్టారు. ఇవే మల్టీప్లెక్స్ సినిమాలుగా అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించాయి. ఇలా తక్కువ బడ్జెట్లో కమర్షియలార్ట్ సినిమాల పట్ల కొత్త తరం దర్శకులు ఆకర్షితులై, వాళ్ళూ ఈ ట్రెండ్ ని ముందుకు తీసికెళ్ళారు. ఇలా ఇప్పటికొచ్చి హిందీలో వస్తున్న చిన్న చిన్న రియలిస్టిక్, సెమీ రియలిస్టిక్ సినిమాలు ఆర్ట్ సినిమాల రూపు రేఖల్నే మార్చేశాయి.

‘దొరసాని’ ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోలేక, క్రియేటివ్ యాస్పెక్ట్ నీ గ్రహించక, తెలంగాణా సినిమా అంటే ఇంకా ఘనీభవించిన, కాలం చెల్లిన ఆర్ట్ సినిమా అనే దురభిప్రాయంతోనే వుండిపోయింది. దీంతో దీనికి యూత్ అప్పీల్ కి బాగా నష్టం జరిగింది. కొందరు మేధావులు చూసి కొనియాడితే కొనియాడ వచ్చు, అంతవరకే.

ఎవరెలా చేశారు:
ఆనంద్ దేవర కొండ ఆర్ట్ సినిమా బాపతు పాసివ్ క్యారక్టర్ చేశాడు. ఆర్ట్ సినిమా మొదటి లక్షణమే పాసివ్ క్యారక్టర్ ని కలిగి వుండడం. నక్సల్ ఉద్యమ కాలంలో నక్సలైట్ గా ముద్ర పడ్డ తన పాత్రతో, ఆ నక్సలిజంతోనైనా దొరని ఎదుర్కొని, ప్రేమని జయించుకోవాలన్న ఉద్యమ స్ఫూర్తి మరచిన బలహీన పాత్రని బలహీనంగానే పోషించాడు – తనతో శంకరన్న అనే నక్సలైట్ తోడున్నప్పటికీ. దొరల కుటుంబాలతో ఇలాటి ప్రేమ పెళ్ళిళ్ళు జరిగితే నన్నా సమ సమాజం వస్తుందన్న ఒక భావజాలం వుంటుంది శంకరన్న పాత్రకి. ఆనంద్ పాత్రకి ఇలాటి ప్రేమల చుట్టూ వుండే సామాజిక ఉద్రిక్తల జ్ఞానం గానీ, స్పృహగానీ అసలు కానరావు. ఇక ప్రేమ సన్నివేశాలు రాత్రి పూట జరిగే సన్నివేశాలుగానే వుండడంతో, తనలో హావభావ ప్రదర్శనా సామర్ధ్యం ఎంతుందో బయట పడకుండా సేఫ్ గా ఎస్కేప్ అయ్యాడు.

దొరసానిగా శివాత్మిక మాత్రం అది ఆర్ట్ సినిమాలకి ఫార్ములా పాత్రయినప్పటికీ మంచి ముఖ వర్ఛస్సుతో, సమయోచిత భావోద్వేగాల ప్రదర్శనతో పాత్రకి, దొరసాని సినిమా టైటిల్ కీ వన్నె తెచ్చింది. దొరగా నటించిన వినయ్ వర్మ ఫ్యాక్షన్ దొరల్లాగా కాకుండా, ముఖంలో క్రోధావేశాలు బదులు, గొంతెత్తి అరవడం బదులు, సాలోచనగా పరిస్థితిని వీక్షించి, చేసేదేదో కూల్ గా చేసుకుపోయే పాత్రలో ఆకట్టు కుంటాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కూతుర్ని పల్లెత్తు మాటకూడా అనని కూల్ నెస్ అతడిది.

ఇక నక్సలైట్ గా కిషోర్ సరిపోయాడు. ఇతర పాత్రల్లో అందరూ కొత్త వాళ్ళే కన్పిస్తారు.
నైసర్గిక ముఖ చిత్రం సహా పీరియెడ్ లుక్ 1980ల కాలాన్ని ప్రదర్శించే కళా దర్శకత్వంతో, ఛాయాగ్రహణంతో వుంది. పాటలు, నేపధ్య సంగీతం, ప్రొడక్షన్ విలువలు బావున్నాయి. సంభాషణలు ఒక జిల్లాకి పరిమితమయ్యే తెలంగాణా మాండలికంతో గాకుండా అందరికీ అర్ధమయ్యేలా వున్నాయి.

చివరికేమిటి:
ఆనర్ కిల్లింగ్స్ ఆనాడు జరిగినట్టే ఈనాడూ జరుగుతున్నాయనీ, దీని గురించి తీవ్రంగా ఆలోచించాలనీ ఈ ఆర్ట్ సినిమా ద్వారా చెప్పాడు దర్శకుడు. పరిష్కారం మాత్రం చెప్పలేదు. ముగింపు విషాదాంతం చేశాడు. దీంతో తను వ్యవస్థ వైపే వున్నట్టు తేలింది. విప్లవ పాత్రల్ని పాతరేసింది ఇందుకే అన్నట్టు వుంది. దొరతనం జిందాబాద్ అయిపోయింది. తీవ్రంగా ఆలోచించ మనాల్సింది ప్రేక్షకుల్ని కాదు, పీడక వర్గాల్ని.

కథ నడక నెమ్మదిగా, భారంగా వుంటుంది. ఫస్టాఫ్ అంతా ప్రేమలోఎలా పడ్డారో రిపీటయ్యే సీన్లతోనే వుంది. ఇతరత్రా దొర పీడించే సబ్ ప్లాట్స్ వున్నాయి. ఇక తెలంగాణా సినిమా అంటే సంస్కృతినీ, పండగలనీ చూపించడం కంపల్సరీ అన్నట్టుగా ఇక్కడ కూడా వుంది. ఫస్టాఫ్ పావుగంట తగ్గించి, గంటకి పరిమితం చేసివుంటే వీక్షకులకి భారం తగ్గుతుంది.

దొరకి తెలిసిపోయాక సెకండాఫ్ లో కథ వేగం పెరిగినట్టు అన్పించినా, హీరో కి ఒక గోల్ అంటూ లేకపోవడంతో పాసివ్ కథనం యథాతథంగా కొనసాగుతుంది. ముగింపు అనూహ్యంగా, షాకింగ్ గా వుంది. మొత్తంగా దర్శకత్వంలో నీట్ నెస్ వుందిగానీ, అది ఆర్ట్ సినిమా ధోరణి కావడంతో సత్ఫలితాల్ని రాబట్ట లేకపోయింది.

‘మల్లేశం’ కూడా ఆర్ట్ సినిమా ధోరణితోనే వచ్చింది. కాకపోతే అది బయోపిక్ కాబట్టి ఆక్షేపించ వీల్లేకుండా వుంది. అయినా బాక్సాఫీసుని జయించలేక పోయింది. ‘మల్లేశం’ గానీ, ఇప్పుడు ‘దొరసాని’ గానీ ప్రధానంగా యూత్ అప్పీల్ లోపించి, శ్యాం బెనెగళ్ సక్సెస్ ఫుల్ క్రాసోవర్ ప్రయోగానికి దూరంగా వుండిపోయాయి. ముందు తెలంగాణా సినిమా అంటే ఆర్ట్ సినిమా అన్న అభిప్రాయాన్ని తుదముట్టించుకుంటే తప్ప, నేటి తరం ప్రేక్షకులు  మెచ్చే తెలంగాణా సినిమాలు వచ్చే అవకాశం లేదు.

రచన – దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
తారాగణం : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి, ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి
సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్
బ్యానర్స్ : మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు :మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ గంగినేని
విడుదల : జులై 12, 2019
2.25 

-సికిందర్