లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే‘ రివ్యూ
హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి కి స్వేచ్ఛ కల్పించకపోతే, దర్శకురాళ్ళు అనే మాటకి అర్ధం వుండక పోవచ్చు. ఈ విషయం దర్శకురాలు అలంకృతా శ్రీవాస్తవ్ కి బాగా తెలిసినట్టుంది. ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా‘ తీసినప్పుడే హీరో స్వామ్యపు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలకి సర్దుకుంటున్న స్త్రీ పాత్రల్ని పోగేసి, ఉన్నతీకరించి ఒక సక్సెస్ సాధించింది. ఇప్పుడు ‘డాలీ, కిట్టీ, ఔర్ వో చమక్తే సీతారే‘ తో తారా స్థాయి కెళ్లింది. అసలు దేశంలో ఆడవాళ్ళు ఏం కోరుకుంటున్నారో సినిమాల్లో బయటపడని కాలక్షేప చిత్రణ లుంటాయి స్త్రీ పాత్రలతో. అదంతా బయటపెట్టింది దర్శకురాలు. కనీసం గర్ల్ ఫ్రెండ్ మనసేమటో తెలియని బాయ్ ఫ్రెండ్స్ హాయిగా జీవించేస్తూంటారు. రెండో వైపు హాయి గురించి సాధారణ సినిమా సంకెళ్లని బద్దలు కొడుతూ దర్శకురాలు ఆలోచించినప్పుడు అది షాకవదు, శరవేగంగా మారిపోతున్న గ్లోబల్ యుగంలో విప్పి చెప్పడానికి అవకాశం చిక్కిన అణగారిన నిజం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పే కళా స్వేచ్ఛ రాదు.
‘డాలీ, కిట్టీ, ఔర్ వో చమక్తే సీతారే‘ (డాలీ, కిట్టీ, ఆ మెరిసే నక్షత్రాలు) మగాడికి ఆడది ఇచ్చే రేటింగ్స్. దేని ప్రాతిపదికన ఆమె రేటింగ్స్ ఇస్తుందనేది రొటీన్ ప్రేమ కథల చాక్లెట్ హీరోయిన్ వూహ కందని విషయం. కళ్ళు మాత్రమే వుండే చాక్లెట్ హీరోయిన్ కి పీచు మిఠాయే పరమాన్నంలా కన్పిస్తుంది. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేస్తుంది. దర్శకురాలు ఈ మైండ్ సెట్ ని సరి చేసింది. భూమీ పడ్నేకర్ రేటింగ్ తెలీక మోసపోతే, కొంకణా సేన్ అనుకున్న రేటింగ్ ఇచ్చేటప్పటికి కోరుకున్నది వుండదు. అయినా రాజీపడక తన మార్గం తను నిర్ణయించుకుంటుంది.
రాధ అలియాస్ డాలీ (కొంకణా సేన్ శర్మ) గ్రేటర్ నోయిడాలో భర్తతో, ఇద్దరు కొడుకులతో వుంటుంది. చిన్న కంపెనీలో సగటు ఉద్యోగం. భర్త అమిత్ (అమీర్ బషీర్) కేదో ఉద్యోగం. గ్రేటర్ నోయిడా అభివృద్ధి పథాన్ని తామూ అందుకోవాలని ఆరాటం. ఇందుకోసం అత్యాధునిక ఆకాశహార్మ్యంలో ఖరీదైన ఫ్లాట్ కి ఇన్ స్టాల్ మెంట్స్ కట్టడం. వుంటున్న ఇరుకు ఫ్లాట్ లో సర్దుకుని జీవించడం. వాయిదాల్లో కొనబోతున్న స్వర్గాన్ని ఎంత పూర్తయిందా వెళ్ళి చూసుకోవడం. కలల్లో తేలిపోవడం. ఇలా సాగిపోతున్న డాలీ జీవితంలోకి కజిన్ కాజల్ ప్రవేశించడంతో ఆమె ఉనికికే సవాలుగా మారుతుంది.
కజిన్ కాజల్ (భూమీ పడ్నేకర్) సుందర భవిష్యత్ వెతుక్కుంటూ బీహార్ నుంచి వచ్చేస్తుంది. బీహారు పట్టణపు సగటు అమ్మాయికి గ్రేటర్ నోయిడా వ్యాపార సంస్కృతిలో భాగమవాలని క్వాలిఫికేషన్ లేకపోయినా కలలు. చెప్పుల కంపెనీలో గంతకుతగ్గ బొంత ఉద్యోగంలో పెట్టిస్తుంది డాలీ. ఆ ఉద్యోగంలో చేరి క్రిక్కిరిసిన హాస్టల్లో బెడ్ మీద ఇంత చోటు సంపాదించుకుంటుంది కాజల్. కానీ పీనాసీ కంపెనీ యజమాని జీతంలో కోతలు పెడితే యూనీఫామ్ వాడి మొహాన కొట్టి వచ్చేస్తుంది. అప్పుడు అసలైన గ్రేటర్ నోయిడా కల్చర్లో నేరుగా అడుగుపెట్టే హైటెక్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. అది రోమాన్స్ యాప్ కాల్ సెంటర్. రోమాంటిక్ గా మాట్లాడే అబ్బాయిలతో రోమాంటిక్ గా మాట్లాడి తృప్తిపర్చాలి. అవసరమైతే ఫోన్ సెక్స్ కూడా వుంటుంది. మొదట కంగారుపడ్డా, కాల్ సెంటర్లో మిగతా తనలాంటి ఉద్యోగినుల్ని చూసి అలవాటుపడుతుంది.
అప్పుడు లైన్లో కొస్తాడు ప్రదీప్ (విక్రాంత్ మాసీ) అనే కాలర్. కిట్టీగా నిక్ నేమ్ పెట్టుకున్న కాజల్ అతడితో ఇంటరాక్ట్ అవుతూంటుంది. ఇటు డాలీ సొంతమవబోయే స్వర్గం తాలూకు కల్చర్ ని ఇక్కడే కాస్త వొంట బట్టించుకోవాలన్నట్టు వంట పక్కన పడేసి, ఫుడ్ ఆర్డర్ చేస్తుంది యాప్ లో. ఫుడ్ డెలివరీ బాయ్ ఉస్మాన్ అన్సారీ (అమోల్ పరాశర్) కాస్త లేటుగా వచ్చేసి ఆమెని నిరాశపరుస్తాడు. సారీ చెప్పి డెలివరీ ఇచ్చి వెళ్లిపోతూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇమ్మంటాడు. ఆమె రెండున్నర స్టార్ల రేటింగ్ ఇస్తుంది.
అటు కిట్టీని క్రమంగా ప్రేమలోకి దింపేస్తాడు ప్రదీప్. ఇటు డాలీ క్రమంగా ఉస్మాన్ ని తన వైపు ఆకర్షించుకుంటుంది. అటు కిట్టీ ప్రదీప్ తో పడకెక్కి కన్యాత్వం పోగొట్టుకుంటుంది. అటు డాలీ భర్తతో రెండేళ్లుగా దక్కని సుఖమంతా ఉస్మాన్ తో తీర్చుకుంటుంది. కిట్టీతో కావాల్సింది పొందిన ప్రదీప్ పరారవుతాడు. తన వెనుక భర్త నడుపుతున్న ‘వ్యవహారం‘ కూడా తెలుసుకుని తన ‘వ్యవహారం‘ జస్టీఫై అయిందనుకుంటుంది డాలీ.
అయితే కిట్టీ తన కంటే ఆర్ధికంగా ఎదుగుతూ ఆధునికంగా మారడం ఈర్ష్య పుట్టిస్తుంది. ఘర్షణ పుట్టిస్తుంది. తను ఫ్లాట్ కి ఇన్ స్టాల్ మెంట్లు కట్టిన డబ్బులో ఆఫీసులో కొట్టేసిందీ వుంది. ఇందుకు శిక్షా అన్నట్టు ఆ బిల్డర్ మోసం చేసి ఉడాయిస్తాడు. ఇప్పుడు కలలు కూలిపోయి, భర్తతో వుండలేని పరిస్థితుల్లో, ఏం నిర్ణయం తీసుకుందన్నది మిగతా కథ.
‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా‘ లో సగటు మధ్యతరగతి యువతులు ఉన్నత తరగతికి రాత్రికి రాత్రి ఎదిగిపోవాలని ఎంచుకునే మార్గాలు వాళ్ళని తిరిగి యధాస్థితికి తీసుకొస్తాయి. ప్రస్తుత సినిమాలో డాలీ, కిట్టీ ఇద్దరూ ఎకనమిక్స్ ని సెక్స్ తో మిక్స్ చేసి భంగ పడ్డారు. సెక్సూ ఎకనమిక్స్, ప్రేమవ్యవహారాలూ ఆర్ధికాభివృద్ధి ఒక వొరలో ఇమడవని తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో బలమైన ప్రతీకలుగా వుంటారిద్దారూ. కిట్టీ కోరుకున్న కెరీర్ నిర్మించుకుంటున్న సమయంలో ఎఫైర్ మొదలెట్టుకోవడం ఆమెకి శాపమైతే, సంసార సుఖం లేని డాలీ, ఆర్ధిక సౌఖ్యాల కోసం ప్రాకులాడ్డం ఆమెకి శాపమైంది. దీంతో ఓటమి పొందిన పాత్రలుగా మిగిలిపోయారా అంటే కాదు, శాపాలకి తలవంచకుండా వరంగా మార్చుకున్నారు.
కిట్టీ ఉద్యోగం మానేసిన అదే కంపెనీకి వెళ్ళి, రోమాన్స్ యాప్ ని ఆడవాళ్ళ కోసం డెవలప్ చేయాలని ఐడియా ఇస్తుంది. కోరికలు మగాళ్లకేనా, ఆడవాళ్ళకుండవా అని గుర్తు చేస్తుంది. దీంతో ఆడవాళ్ళ కోసం రోమాన్స్ యాప్ బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. అప్పటికే ఉస్మాన్ సమాధి మీద ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన డాలీ, భర్తని వదిలేసి ఒక కొడుకుతో వెళ్లిపోతుంది. ఇక్కడ ఒక పాత్ర యోని ప్రస్తావన తీసుకొస్తుంది. యోనితో ముడి పడి ఆడవాళ్ళ మనసేలా వుంటుందో చిత్ర పటంతో వివరిస్తుంది. ఈ వివరిస్తున్న డీజే ప్రోగ్రాంలో కాషాయ బృందం జొరబడి బీభత్సం సృష్టిస్తుంది.
ఒక సంధర్భంలో కిట్టీ తో అంటుంది డాలీ – రెండేళ్లుగా నాకు సెక్స్ లేదు. అమిత్ ఏదో నా లోపల కదులుతాడు. నాకేమీ అన్పించదు, మంట పుడుతుంది. నేను మంచు గడ్డ లాంటి దాన్ని, నాలో సెక్స్ లేదు – అని. అసలామె నచ్చని వాణ్ణి పెళ్లి చేసుకోవడమే సమస్య. ఇంకో సందర్భంలో తల్లిని అడుగుతుంది – నువ్వు మీ ఆయనతో సెక్స్ సుఖం పొందావా అని. లేదంటుంది, అందుకే లైంగిక స్వేచ్ఛ వెతుక్కున్నా నంటుంది తల్లి.
లెక్చర్లివ్వ కుండా సంఘటనలతో సాగుతుంది సినిమా. అంతరార్థంతో కూడిన సంఘటనలు. నెట్ యుగపు ప్రేక్షకులకి నిశ్శబ్ద సైకో థెరఫీ.
రచన – దర్శకత్వం : అలంకృతా శ్రీవాస్తవ్
తారాగణం : కొంకణా సేన్ శర్మ, భూమీ పడ్నేకర్, అమీర్ బషీర్, విక్రమ్ మాసీ, అమోల్ పరాశర్, నీలిమా అజీమ్ తదితరులు
సంగీతం : మంగేష్ ధడ్కే, ఛాయాగ్రహణం : జాన్ జాకబ్
నిర్మాతలు : ఏక్తా కపూర్, శోభా కపూర్
విడుదల : నెట్ ఫ్లిక్స్
3/5
―సికిందర్