హెల్ప్! హెల్ప్! – ‘రణరంగం’ మూవీ రివ్యూ
శర్వానంద్, సుధీర్ వర్మ, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్ – నల్గురూ నాల్గు ఫ్లాపులిచ్చాక (పడిపడి లేచే మనసు, కేశవ, సీత, హలో), హిట్టిచ్చిన (జెర్సీ) సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మాణంలో ‘రణరంగం’ అంటూ విజయం సాధించడానికి చేయిచేయి కలిపారు. అయితే ఇంటర్వెల్లో ఉన్నట్టుండీ కాజల్ అగర్వాల్ హెల్ప్ కోసం ఎందుకు అరవాల్సి వచ్చిందో తెలుసుకుందాం…
కథ
వైజాగ్ లో దేవా (శర్వానంద్) నేస్తాలతో కలిసి సినిమా టికెట్ల బ్లాక్ దందా చేస్తూంటాడు. ఒక కాలేజీ కెళ్ళే మధ్యతరగతి అమ్మాయి (కళ్యాణీ ప్రియదర్శన్) ని ప్రేమిస్తాడు. కొంతకాలం గడిచాక అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం మద్య నిషేధం విధించడంతో ఒరిస్సానుంచి మద్యం స్మగ్లింగ్ చేసి అమ్ముతూంటాడు. ఇదే దందాలో వున్న ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ) తో గొడవలొస్తాయి. పరస్పరం దాడులు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి మధ్య నిషేధం ఎత్తేసి వేలం పాటలు పెట్టడంతో దేవాయే పైచేయి సాధిస్తాడు.కల్యాణిని పెళ్లి చేసుకుని బిడ్డని కంటాడు. పగబట్టిన సింహాచలం కళ్యాణిని చంపించేస్తాడు. దేవా సింహాచలాన్నీ అతడి వర్గాన్ని చంపేస్తాడు.
పదేళ్ళ తర్వాత ఇప్పుడు రిచ్ డాన్ గా ఎదిగిన దేవా కూతురితో స్పెయిన్లో వుంటాడు. అతడికొక ఆఫర్ వస్తుంది. వైజాగ్ లో అంతర్జాతీయ విమానాశ్రాయం వస్తున్నందున ఆ చుట్టుపక్క గ్రామాల భూములు కొట్టేయాలని కేంద్రమంత్రి దేవా సాయం కోరతాడు. దేవా తిరస్కరించడంతో అతడి మీద హత్యా ప్రయత్నం చేయిస్తాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ గీత (కాజల్ అగర్వాల్) సాయంతో దేవా కోలుకుని ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.
ఎలా వుంది కథ
మాఫియా కథలెలా వుంటాయో ఆ టెంప్లెట్ లోనే రొటీన్ గా వుంది. అయితే మద్యనిషేధాన్ని వ్యాపారం చేసుకునే హీరోయిజపు కథగా గ్లామరైజ్ చేసి చూపించారే తప్ప, మద్యనిషేధాన్ని కథకి ఒక ఎమోషనల్ పాయింటుగా వాడుకోలేదు. మద్యానికి కుటుంబాలు బలి అవుతున్నాయని ఎన్టీఆర్ నిషేధం విధించినప్పుడు, దాన్ని ఎలాటి సెంటిమెంట్లు లేకుండా హీరో స్వార్థంతో సొమ్ము చేసుకుని ఎదిగే కథగానే ఇది మిగిలిపోయింది. ఎప్పుడైనా తను చేస్తున్న దందా వల్ల పది కుటుంబాలు బలైతే, మద్యనిషేధం పరమార్ధం తెలిసొచ్చి కథలో భావోద్వేగాలు పుట్టేవి. అయితే అప్పుడీ నెగెటివ్ పాత్ర పాజిటివ్ గా మారితే అనుకున్న కథ వుండదు కాబట్టి, కథకోసం పాత్రని ఫీలింగ్స్ లేని కేవలం కార్డ్ బోర్డు క్యారక్టర్ గా కొనసాగించారు. ఇలా చెప్పుకోవడం అతిగానే అన్పిస్తుంది – ఎన్టీఆర్ మద్యనిషేధాన్ని తూట్లు పొడిచిన దయలేని కథగా, పాత్రగా అన్పిస్తే అది మన అమాయకత్వమే కావచ్చు.
ఎవరెలా చేశారు
మోహంలో మార్పు లేకుండా అదే వయసులో వున్నట్టు శర్వానంద్ పదేళ్ళు ఎడంగా వున్న రెండు కాలాల కథలో నటించాడు. ఫ్లాష్ బ్యాక్ దృశ్యాల్లో ఇంకా సన్నబడి కోరమీసంతో (అప్పట్లో గడ్డాలు పెంచుకుని తిరిగే వాళ్ళు కాదు. అప్పటి సీనియర్ స్టార్లు గడ్డాలతో నటించలేదు. జ్యూనియర్ స్టార్లు గడ్డాలు మొదలెట్టాకే అది చూసి జనాలు ఫ్యాషన్ గా చేసుకున్నారు), సాధారణ దుస్తుల్లో స్పీడున్న కత్తిలాటి టౌను కుర్రాడిలా వుంటే వేరియే షన్ వుండేది. పాత్రకి పీరియడ్ లుక్ ని దృష్టిలో పెట్టుకోలేదు. ఇక పాత్రగా మనల్ని నవ్వించి, బాధపెట్టి, మెలిపెట్టి, థ్రిల్ చేసి, ఎక్సైట్ చేసి ఆకట్టుకోవడానికి బేసిగ్గా క్యారక్టర్ అలా లేదు. భార్య మరణించిన దృశ్యంలో కూడా ఫ్లాట్ గా వున్నాడు. కథే ఎమోటివ్ గా లేనప్పుడు నటన ఏముంటుంది. ఇక కథ ఆకస్మిక ముగింపు కూడా పాత్రకి కలిసిరాలేదు. పాత్రని సశేషం చేసింది. ఎన్నో విషయాలు చెప్పలేదు.
ఇక యాక్షన్ సీన్స్, పాటలు, ఒక హీరోయిన్ తో రోమాన్సు వరకూ ఫర్వాలేదు. రెండో హీరోయిన్ కాజల్ తో రోమాన్సు లేదు. కూతురి పాత్ర వుంది. ఈమె చీటికీ మాటికీ దృశ్యాల్లో జోక్యం చేసుకుని చీకాకు పరుస్తుంది.
హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ మధ్యతరగతికి చెందిన అణకువ గల అమ్మాయిగా ఫ్లాష్ బ్యాక్ లో కన్పిస్తుంది. ఇలాటి అమ్మాయి ఒక బ్లాకులో టికెట్లు అమ్ముకునే, లిక్కర్ స్మగ్లింగ్ చేసే, పోలీసు ప్రాబ్లం వుండే, లాకప్ లో పడే హీరోలో ఏం చూసి ప్రేమిస్తుందో ఆధారం దొరకదు. అతను చేసే పనుల్ని లైట్ గా తీసుకుంటుంది. తండ్రి కూడా నీ నిర్ణయం నువ్వు తీసుకోమంటాడు. క్రిమినల్ ని అల్లుడుగా ఎలా చేసుకుంటాడో తెలీదు. చివరికి ఏమయింది- నిర్ణయాన్నిఆమెకి వదిలేసి పెళ్లి చేస్తే, మద్యం మాఫియాల గొడవల్లో దుర్మరణం పాలయ్యింది. నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె వయస్సెంత?
కాజల్ అగర్వాల్ ముసిముసిగా నవ్వుతూ వచ్చి పోయే పాత్ర. హీరో దోస్తులు ఫ్లాష్ బ్యాకులో ఇప్పటి గడ్డాలు, జుట్లూ పెంచుకుని వీళ్ళు కూడా పీరియడ్ లుక్ ని మటాష్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ లో విలన్ గా మురళీ శర్మ రఘువరన్ గొంతుని, నటనని ఇమిటేట్ చేయడం బావుంది. కానీ ప్రధాన కథలో పెద్ద విలన్ లేకుండా పోయాడు. ఇది మూవీకి పెద్ద లోపం, బలహీనత.
టెక్నికల్ గా పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ విలువలతో వుంది. అయితే సినిమా సాంతం మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకుగా సాగే విజువల్స్ కి, పీరియడ్ లుక్ కోసం టింట్ మారిస్తే బావుండదనుకున్నారో ఏమో, ప్రధాన కథ విజువల్స్ గానే కెమెరా వర్క్ చేశారు. దీంతో వేరియేషన్ కన్పించదు. పాటలు, మ్యూజిక్ ట్రాక్ బావున్నాయి.
చివరికేమిటి
దర్శకుడు సుధీర్ వర్మ ‘స్వామిరారా’ అనే హిట్ తర్వాత తీసిన రెండు ఫ్లాపులు ‘దోచేయ్’, ‘కేశవ’ ల కంటే మేకింగ్ పరంగా ఇది నాణ్యతతో వుంది. దర్శకుడుగా ఇంప్రూవ్ అయ్యాడు. అయితే కథకుడిగా ఇంకా కృషి చేయాల్సి వుంది. హీరో పాత్రని మర్చి పోలేని విధంగా తీర్చి దిద్దాల్సి వుంది. మాఫియా సినిమాలు ఎన్నో వచ్చాయి. కొత్తగా ఏం చెప్పినట్టు? గ్యాంగ్ వార్సే కథవదుగా? ఏదైనా ఒక విలువ కోసం హీరో ఎమోషనల్ పోరాటం చేయాలిగా? ఇలా అంటే నవ్వు రావొచ్చు గానీ- కనీసం మద్య నిషేధాన్ని తూట్లు పొడవడం తప్పని చివరికైనా గుర్తించాలిగా ఎన్టీఆర్ స్మృతి కోసం? లేకపోతే మద్యనిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబుని సమర్ధిస్తూ ఈ మూవీ తీశారా?
ఇక కాసేపు అప్పటి కథ కాసేపు ఇప్పటి కథ చూపించుకుంటూ రావడంతో పదహారు సార్లు ప్రధాన కథ ఆగడం వాళ్ళ ఎమోషనల్ కంటిన్యూటీ ఏదైనా ఉందనుకుంటే అది కూడా వీల్లేకుండా పోయింది. ఫ్లాష్ బ్యాక్ లో చివరిదాకా ఖండఖండాలుగా చూపించుకుంటూ పోయింది సమాంతరంగా చూపిస్తున్న ప్రధాన కథకి కేవలం ఉపోద్ఘాతంగానే మిగిలింది. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ వాళ్ళ ప్రధాన కథ స్ట్రక్చర్ – యాక్ట్స్ – క్యారక్టర్ గోల్స్ చెదిరిపోతూ వెళ్ళాయి. ఇక ప్రధాన కథలో తన మీద ఎవరు హత్య ప్రయత్నం చేశారో హీరోకి తెలీదన్నట్టు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టూ చూపించడం చెడగొట్టింది. ఇది ఇన్వెస్టిగేషన్ జానర్ కథా? హత్యప్రయత్నం చేసిన వాడి మీద వెంటనే చర్యకి దిగే యాక్షన్ కథ కాదా? కేంద్ర మంత్రి ఆఫర్ ని తను తిరస్కరించాక ఇంకెవరు హత్యాయత్నం చేస్తారని తెలియక పోవడానికి?
శర్వానంద్, సుధీర్ వర్మ, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్ నల్గురూ ఈసారి విజయం కోసం చేతులు కలిపి రణరంగంలోకి దూకారు బాగానే వుంది – ఇంటర్వెల్లో శర్వానంద్ మీద ఎటాక్ జరుగుతున్నప్పుడు అక్కడే వున్న కాజల్ అగర్వాల్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఆమె అరుపుల మీదే ఇంటర్వెల్ పడుతుంది. అప్పుడు మనకి అన్పిస్తుంది – ఈ మూవీ మునిగే నావ కాబట్టి అలా హెల్ప్ కోసం అరుస్తోందని…వెల్ డన్ కాజల్ అగర్వాల్!
రచన – దర్శకత్వం సుధీర్ వర్మ
తారాగణం : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై, ఛాయాగ్రహణం : దివాకర్ మణి
బ్యానర్ ; సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల : ఆగస్టు 15, 2019
2 / 5
―సికిందర్
―