అమీర్‌ఖాన్‌ తనయుడితో సాయిపల్లవి ప్రేమకథ!

దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న అగ్ర కథానాయిక సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి పెడుతున్నది. ‘రామాయణ’ చిత్రం ద్వారా ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అమీర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌తో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నది. అమీర్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సునీల్‌పాండే దర్శకుడు.

ఈ చిత్రానికి ‘ఏక్‌ దిన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అమీర్‌ఖాన్‌ స్వయంగా వెల్లడించారు. హృద్యమైన ప్రేమకథాంశమిదని, ఈ సినిమాతో సాయిపల్లవి ఉత్తరాది యువతకు చేరువవుతుందని చిత్రబృందం పేర్కొంది. ఇదిలావుండగా ఇటీవల విడుదలైన ‘అమరన్‌’ చిత్రంలో సాయిపల్లవి అద్భుతాభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి హిందీ సినిమాల తాలూకు అప్‌డేట్స్‌పై అక్కడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.