మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ పరిచయమయ్యాడు. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి తొలి పాటతోనే అందరితో విజిల్స్, స్టెప్స్ వేయించి… అందరి చూపు తనపైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో తిరుగులేని కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు రాఘవ లారెన్స్.
ఇదే క్రమంలో మెగాఫోన్ చేతబట్టి ‘మాస్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అక్కినేని అభిమానులకు మరిచిపోలేని హిట్టిచ్చి… ఆ తర్వాత హీరోగాను అవతారం ఎత్తాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో హీరోగా ‘స్టైల్’ సినిమా తీశాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమాలతో విజయ పరంపర కొనసాగించాడు. అయితే ‘కాంచనా’ సిరీస్ తో లారెన్స్ క్రేజ్ పెరిగిపోయింది.
ప్రస్తుతం రాఘవా లారెన్స్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం రుధ్రన్. కథిరేశన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగులో రుద్రుడు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్‌డేట్ బయటకు వచ్చింది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. యెల్లో కలర్ బ్లేజర్ లో రాఘవ లారెన్స్ కూల్ లుక్ లో ఇస్తున్నారు. చేతిలో పూల బోకే ఉంది. ఈ పోస్టర్ లో కూడా రాఘవ లారెన్స్ డాన్స్ మూమెంట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ పోస్టర్ పై రుద్రుడు ఈ ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానునట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు పోస్టర్స్ మంచి స్పందన వస్తోంది. అయితే ఇదే రోజు సమంత నటిస్తున్న శాకుంతలం, అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో రుద్రుడికి పోటీ బాగానే ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రుద్రుడు ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.