ఒక పండుగ, ఒక ఉత్సవం, ఒక విజయం.. ఇవన్నీ ప్రజల హర్షాతిరేకానికి మారుపేరు. కానీ అదే ఉత్సాహం కొన్ని క్షణాల్లో ప్రాణాంతక విపత్తుగా మారితే? తాజాగా బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన ఇదే విషయాన్ని మరోసారి స్పష్టంగా గుర్తు చేసింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పడిన గందరగోళంలో 11 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ఆనందాన్ని ఆస్వాదించడానికి వచ్చిన వారు ఊహించని విధంగా తమ కుటుంబాలకు శోకాన్ని మిగిల్చారు.
కేవలం బెంగళూరు ఘటన మాత్రమే కాదు, గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా అత్యంత విషాదకరంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలు విపరీతంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో, గోవాలోని లైరాయ్ ఆలయంలో జరిగిన దుర్ఘటనలు, తిరుపతిలో భక్తుల గందరగోళం.. ఇవన్నీ ఒకే మూల కారణాన్ని చూపిస్తున్నాయి.. అదే భద్రతా నియమాలు తగినంతగా అమలవ్వకపోవడం.
ప్రముఖ బాబా సత్సంగ్ సందర్భంగా హత్రాస్‌లో జరిగిన ఘోర దుర్ఘటన మరువలేనిది. 2.5 లక్షల మందికి పైగా గుమిగూడగా, అత్యధికంగా 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఆధ్యాత్మిక సందర్భాల్లోనూ, సినిమాల ప్రీమియర్‌ల వంటి వినోద కార్యకలాపాల్లోనూ, మళ్ళీ మళ్ళీ ఇదే తీరులో ప్రాణాలు పోతున్నాయి. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్‌ను చూడాలనే ఉత్సాహం ఒకరిని బలి తీసుకుంది.
ఈ ఘటనలన్నింటిలోనూ ఒక సామాన్య మార్గం కనిపిస్తోంది.. ప్రజలపై రిస్క్ గణన చేయని నిర్వాహకులు, సమర్థవంతంగా స్పందించని భద్రతా వ్యవస్థలు. ఈ ప్రమాదాలు ఊహించలేనివి కావు, కానీ నిర్లక్ష్యం వల్ల నివారించలేనివిగా మారుతున్నాయి. ఒక వేడుకను విజయవంతంగా నిర్వహించాలంటే, జనాభా నియంత్రణ, అవగాహన, రిస్క్ మేనేజ్‌మెంట్ అనే అంశాలు ముందే పక్కాగా అమలులోకి రావాలి. ఇప్పటికైనా గుణపాఠం తీసుకుని ప్రభుత్వాలు, సంస్థలు ప్రజల భద్రతపై ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది. సమయానికి చర్యలు తీసుకోకపోతే… కుటుంబాలలో తీరని విషాదలను మిగులుస్తుంది.