Kashmir files : ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోస్తున్న కాశ్మీర్ ఫైల్స్…!

Kashmir files : చిన్నగా మొదలై పెద్ద సినిమాలకు పోటీగా దూసుకెళ్తున్న సినిమా. రాధే శ్యామ్ విడుదలైన మార్చి 11 న విడుదలై ఈ సినిమా అంచనాలను తారుమారు చేస్తూ కలెక్షనల వర్షం కురిపిస్తోంది కాశ్మీర్ ఫైల్స్.కాశ్మీర్ ఫైల్స్ ఇపుడు ఇండియాను ఆలోచింపచేస్తున్న చిత్రం. ప్రధాని నుండి సాధారణ పౌరుడి వరకు అందరు చూసి మెచ్చుకుంటున్న చిత్రం.

ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్‌ పండిట్‌ల పై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తున్న చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్.

కాశ్మీర్ ఫైల్స్‌ సినిమా విడుదలయ్యే ముందు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయా అని అందరూ అనుకున్నారు. అందుకే కేవలం 610 థియేటర్స్‌లో మాత్రమే కాశ్మీర్ ఫైల్స్ విడుదల చేశారు. కానీ ఒక్కొక్క రోజు పెరుగుతున్న కొద్దీ ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి థియేటర్స్ సంఖ్య కూడా పెంచారు. రెండో వారం ఏకంగా 4 వేల థియేటర్స్ కు తన రేంజ్ పెంచుకుంది కాశ్మీర్ ఫైల్స్. ఇప్పటి వరకు 14 రోజుల్లో 191 కోట్లు వసూలు చేసి.. 200 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. విడుదలైన 14 వ రోజు కూడా 10 కోట్లకు పైగా వసూలు చేసింది కాశ్మీర్ ఫైల్స్. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ట్రిపుల్‌ ఆర్ విడుదలైన తర్వాత కూడా కాశ్మీర్ ఫైల్స్ దూకుడు తగ్గేలా కనిపించడం లేదు.