వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో కీలకమైనది కొత్త జిల్లాల ఏర్పాటు. అంటే ఒక్కొక పార్లమ్నెట్ స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా మారుస్తానని జగన్ అన్నారు. తద్వారా పాలనా సౌలభ్యం పెరిగి, అభివృద్ధి వేగవంతం అవుతుందనేది ఆయన ఆలోచన. ఈ హామీ జనానికి బాగా నచ్చింది. తమ ప్రాంతాలు కూడ జిల్లాలుగా మారుతాయి కాబట్టి ప్రాముఖ్యత, సౌకర్యాలు, సదుపాయాలు పెరుగుతాయి కాబట్టి జగన్ ఆలోచన మంచిదే అనుకున్నారు. ప్రతి విషయంలోనూ జగన్ మీద విరుచుకుపడే ప్రతిపక్షాలు సైతం కొత్త జిల్లాలు తెస్తామంటే ఏమీ నలేకపోయాయి. అందులో విమర్శలు చేయడానికి, వేలెత్తి చూపడానికి ఏమీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు సైతం జిల్లాలను విభజించాలని భావించినవారే. కానీ అప్పటి పరిస్థితులు, నిధుల కొరత, జనం నుండి పెద్దగా డిమాండ్ లేకపోవడం, ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉండటంతో వెనక్కు తగ్గారు.
కానీ జగన్ పని ఎంత పెద్దదైన, ఖర్చు ఎంతైనా సరే ముందుకు దూకారు. 13 జిల్లాలకు కొత్తగా 12 జిల్లాలు కలిపి మొత్తం 25 చేస్తామని, అరకు విషయంలో ఏదైనా మార్పు జరిగితే 26 జిల్లాలు చేస్తామని అన్నారు. జిల్లాల ఏర్పాటు చేయాలంటే భారీగా నిధులు అవసరం. ఖజానా ఖాళీగా ఉన్న ఈ తరుణంలో ఆ పని పెట్టుకోవడం అంటే తలకు మించిన భారమే. కొత్త జిల్లాల కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, మౌళిక సదుపాయాలు, కొత్త రవాణా మార్గాలు ఇలా అన్నీ ఖర్చులే. అందుకే ప్రతిపక్షం నోరు మెదపకుండా చూస్తూ ఊరుకుంది. జగన్ ఒక్కసారి పని మొదలుపెట్టి మధ్యలో ఏదైనా ఇబ్బంది ఎదురై చేయలేకపోతే అప్పుడు మీద పడిపోవాలని భావించాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ అవకాశం దొరికినట్టు కనిపిస్తోంది.
జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా విభజన కార్యక్రమం వేగం తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎంతవరకు పనులు చేసింది, నివేదికల్లో ఏం తేల్చింది అనేది ఇంతవరకు తెలియలేదు. ప్రధానంగా కొత్త సరిహద్దులు గుర్తించడం, కొత్త జిల్ల్లా కేంద్రాలను ఎంపిక చేయడం, కేంద్రం నుండి అనుమతులు తీసుకోవడం, అంచనా వ్యయాలు ఇలా చాలా ప్రక్రియ ఉంది. వాటి మీద ఇంతవరకు ఎలాంటి అప్డేట్ బయటకురాలేదు. మరోవైపు నీలం సాహ్ని ఇంకొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆమె వెళ్ళిపోతే కొత్తగా వచ్చే సీఎస్ పనులు స్టార్ట్ చేయాలంటే ఆలస్యమవుతుంది.
పైపెచ్చు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎన్నికలు మొదలై, మిగియాలనంటే మూడు నెలల టైమ్ పడుతుంది. ఆ సమయంలో జిల్లాల విభజన పనులు దాదాపు ఆగిపోతాయి. యంత్రాంగం మొత్తం ఎన్నికల్లోనే నిమగ్నమై ఉంటుంది. మళ్ళీ పనులు మొదలవ్వాలంటే కాస్త సమయం తీసుకోక తప్పదు. అప్పటికి రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది చెప్పలేం. వైసీపీ నాయకులు కూడ ఈ విషయమై పెద్దగా మాట్లాడట్లేదు. ఇదంతా చూస్తే విభజన కార్యక్రమం ఇప్పుడప్పుడే ఉండేలా లేదని వచ్చే ఏడాది చివరికి కానీ స్పష్టత రాదని అనిపిస్తోంది. ఇదే జరిగితే ప్రతిపక్షం చేతికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక కొత్త సాకు దొరికినట్టే.