ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా, అందరి ఫోకస్ 13 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై పడింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో ఒక టీనేజ్ ప్లేయర్ బరిలోకి దిగడం నిజంగా అరుదైన విషయం. చిన్న వయసులోనే అంతటి అవకాశం దక్కించుకున్న అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ యువ టాలెంట్‌ను 1.1 కోట్లకు దక్కించుకోవడంతో, అతను కచ్చితంగా ఐపీఎల్‌లో కొత్త అధ్యాయాన్ని రాస్తాడనే ఆశలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. మార్చి 23న ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆడే అవకాశం ఎక్కువగానే ఉంది. అండర్-19లో అదరగొట్టిన అతడు, ఐపీఎల్‌లో తన ప్రతిభను ఎలా నిరూపించుకోగలడనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.
గతంలో అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 71 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఐపీఎల్ స్థాయిలో అదే స్థాయిలో రాణిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు 16 ఏళ్లకు మించని వయసులో ఎవరూ ఐపీఎల్‌లో ఆడలేదు. కానీ వైభవ్ 13 ఏళ్లకే ఈ ఘనత సాధిస్తున్నాడు. ఇది అతని ప్రతిభకు నిదర్శనం.
బిహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రాకేశ్ తివారీ కూడా అతనిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, “వైభవ్ గొప్ప ఆటగాడిగా ఎదగాలి. అతడి బ్యాటింగ్‌లోని మెరుపులు త్వరలోనే ఐపీఎల్‌లో వెలుగొందాలి” అని వ్యాఖ్యానించారు. ఈ చిన్న వయసులోనే అంతటి ప్రెజర్‌ను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇవ్వగలిగితే, అతడి భవిష్యత్తు ఎంతో పదిలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ భారీ లీగ్ వేదికపై ఆడటం సులభం కాదు. పైగా బలమైన జట్టుగా ఉన్న SRH బౌలర్లను అతను ఎదుర్కోవడం చాలా కష్టం. అంతటి పోటీ మధ్య యువ ప్లేయర్ ఒత్తిడిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటాడో చూడాల్సిన విషయం.


