Elon Musk: సునీత రాక ఆలస్యానికి కారణం అతనే.. మస్క్ షాకింగ్ కామెంట్స్

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడంపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. తొమ్మిది నెలల అనంతరం వీరు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమిని చేరుకోగా, వారి రాక ఆలస్యానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వమే కారణమని ఎలోన్ మస్క్ ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, వారిని ముందుగానే తీసుకురావాలని తమ ప్రతిపాదనను బైడెన్ ప్రభుత్వం తిరస్కరించిందని పేర్కొన్నారు.

ఇది రాజకీయ కారణాలతోనే జరిగిందని, వాస్తవానికి వారు 8 రోజుల మిషన్ కోసం వెళ్లి తిరిగి రావాల్సి ఉన్నా, దాదాపు 10 నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చిందని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలతో అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మస్క్ అభిప్రాయానికి మద్దతుగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ట్రంప్ తన “ట్రూత్ సోషల్” మాధ్యమంలో బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, వారి నిర్లక్ష్య వైఖరి వల్లే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షంలోనే మిగిలిపోయారని ఆరోపించారు.

మస్క్ ద్వారా వీరిని భూమికి తీసుకురావాలని తాను సూచించానని, ఇది బైడెన్ వైఫల్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతరిక్ష ప్రయాణంలో ఇలాంటి సమస్యలు సాధారణమే అయినా, 2024లో బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లోపాలను గుర్తించిన తర్వాత కూడా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తిరిగి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఈ ఆలస్యం కారణంగా వారు అనవసరంగా ఎక్కువ సమయం అంతరిక్షంలో గడపాల్సి వచ్చిందని విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలపై బైడెన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదం ప్రస్తుతం అమెరికాలో తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ కారణాల వల్ల వ్యోమగాముల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. మరి బైడెన్ టీమ్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.